టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నీ ప్రారంభం

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

అనంతపురం: అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీలోని నాదల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ టెన్నిస్‌ స్కూల్‌ (నెట్స్‌ ) వేదికగా శుక్రవారం జిల్లా స్థాయి టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ప్రారంభమైంది. అనంతపురం జిల్లా టెన్నిస్‌ క్రీడా అభివృద్ధికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో అనంతపురం జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయి కృష్ణ, ఏడీఎల్‌టీఏ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌, జాయింట్‌ సెక్రటరీ నాగరాజ్‌ బాబు (బాబ్జీ), ప్రతినిధి బి.ఆర్‌. ప్రసన్న, ట్రెజరర్‌ రమేష్‌ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి టోర్నమెంట్లలో ప్రతిభ కనబరిచే విజేతలు వచ్చే నెల కాకినాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు.

వరి, మిరప సాగు చేయొద్దు

జేడీఏ సాలురెడ్డి

అనంతపురం అగ్రికల్చర్‌: వరి, మిరప లాంటి పంటలు సాగు చేయకుండా రైతుల్లో అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్‌.సాలురెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏఓలు, ఏడీఏలతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో ఇప్పటి వరకు సాగైన పంటల విస్తీర్ణం, ఇంకా ప్రత్యామ్నాయం ఎంత విస్తీర్ణంలో సాగులోకి రావచ్చనే దానిపై వివరాలు సేకరించారు. పంటల బీమా ప్రీమిమం, ఖరీఫ్‌ ఈ–క్రాప్‌ పురోగతిపై చర్చించారు. ఇదే సందర్భంలో రైతులు కూడా ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, మున్ముందు భూగర్భజలాలు తగ్గిపోయే పరిస్థితి ఉండటం, తాగునీరు, సాగునీటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వరి, మిరప లాంటి పంటలను సాగు చేయొద్దన్నారు. వాటి స్థానంలో ఉలవ, కొర్రలు, అలసందలు, పెసలు లాంటి ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌కేల్లో ప్రత్యామ్నాయ విత్తనాల రిజిష్ట్రేషన్‌ కొనసాగుతోందని, 80 శాతం రాయితీ ఇస్తామన్నారు. 3,800 క్వింటాళ్ల ఉలవలు, 19 క్వింటాళ్లు కొర్రలు ఇప్పటికే 16 మండలాల్లో నిల్వ చేశామని తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.

సెపక్‌ తక్రా పోటీల్లో విజేతలుగా ఉరవకొండ, తట్రకల్లు

వజ్రకరూరు: మండల పరిధిలోని చాబాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జూనియర్స్‌ సెపక్‌తక్రా జిల్లా స్థాయి చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 48 బాల బాలికల జట్లు పోటీలో పాల్గొన్నాయి. ఎంఈఓ ఎర్రిస్వామి, సెపక్‌తక్రా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు షాహిన్‌ క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. బాలుర విభాగంలో ఉరవకొండ జట్టు విజేతగా నిలిచింది. నెరమెట్ల రెండోస్థానం, నింబగల్లు జట్టు మూడోస్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో తట్రకల్లు కేజీబీవీ జట్టు విజేతగా నిలిచింది. కరకముక్కల జెడ్పీహెచ్‌ఎస్‌ జట్టు రెండోస్థానం, గుంతకల్లు కేజీబీవీ జట్టు మూడోస్థానంలో నిలిచాయి. విజేతలకు ట్రోఫీలు, షీల్డ్‌లను ప్రదానం చేశారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు.

బస్సులో

బంగారం మాయం

నార్పల: మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో బస్సులో బంగారం చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. మడుగుపల్లికి చెందిన నందిని అనంతపురం వెళ్లేందుకు నార్పల బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తోంది. బస్సు రాగానే బాగా రద్దీగా ఉండడంతో బస్సులో సీటుకోసం తోటి ప్రయాణికులకు సీటుపై వేయమని చెప్పి తన బ్యాగ్‌ను అప్పగించింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికి బ్యాగ్‌ను పరిశీలించగా సుమరుగా నాలుగు తులాలు బంగారు కనిపించలేదు. దీంతో నందిని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే నార్పల పోలీసుస్టేషన్‌ ఎదుట బస్సును ఆపి ప్రయాణికులను తనిఖీ చేశారు. అయితే తనిఖీలో బంగారం ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement