నల్లచెరువు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మామిడి రైతులకు శాపంగా మారింది. మండల పరిధిలోని ఇందుకూరుపల్లికి చెందిన రైతు జయరాం, జయమ్మ దాదాపు 5 ఎకరాల్లో మామిడి, నేరేడు, జామ చెట్లు నాటారు. అయితే వారి బోరు మోటారుకు సంబంధించిన విద్యుత్ లైనుకు ఉన్న స్టే వైరు నెల రోజుల క్రితం కాలిపోయింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగి కింద పడింది. గమనించిన రైతు జయరాం విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే విద్యుత్ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత రైతు వాపోతున్నారు. వర్షాభావంతో 5 ఎకారాల్లోని మామిడి, నేరేడు, జామ చెట్లు ఎండిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు చేసి పంటలను సాగు చేస్తే విద్యుత్ అధికారులు వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, విద్యుత్ అధికారులు స్పందించకపోతే సమస్యను లెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులు జయరాం, జయమ్మ తెలిపారు.


