2025 జూన్ 22 :
2026 ఆగస్టు 22 :
2026 ఆగస్టు 26 :
స్కార్పియో వాహనంలో సుమారు నాలుగు టన్నుల పశుమాంసాన్ని కర్ణాటకలో దేవనహళ్లి పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీస్తే హిందూపురంలో పశువులను వధించి.. ప్యాకింగ్ చేసి బెంగళూరుకు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. దీంతో కర్ణాటక పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని సంతల్లో పశువులు కొనుగోలు చేసి హిందూపురంలో వధించి ప్యాకింగ్ చేసి వాహనాల్లో బెంగళూరు తరలిస్తుండగా కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. పశు మాంసం సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
హిందూపురం నుంచి ఆరు వాహనాల్లో బెంగళూరుకు తరలిస్తున్న పశుమాంసాన్ని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆ మాంసాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఎద్దులు, ఆవుదూడల మాంసమా? లేక దున్నల మాంసమా అనేది తెలియరాలేదని అప్పట్లో పోలీసులు వెల్లడించారు.
సాక్షి, పుట్టపర్తి
జిల్లా సరిహద్దులోని హిందూపురంలో పశుఘోష వినిపిస్తోంది. ఇక్కడి నుంచే రాత్రింబవళ్లు పశుమాంసం అక్రమ రవాణా జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా పశువులను వధించి.. ప్లాస్టిక్ సంచులు, టమాట బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఐచర్, టాటా ఏస్, స్కార్పియో వాహనాల్లో ఎక్కించి ర్రాతింబవళ్లు బెంగళూరు తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీలు శూన్యం కావడంతో రోజుకు సగటున పశుమాంసం రవాణా చేసే 10 వాహనాలు హద్దు దాటిపోతున్నట్లు తెలుస్తోంది.
రెండేళ్లుగా పెరిగిన అక్రమ రవాణా..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులందరూ టీడీపీ నాయకుల కనుసన్నల్లో విధులు నిర్వర్తిస్తుండటంతో పశుమాంస అక్రమ వ్యాపారం మూడు పూవులు.. ఆరు కాయలుగా సాగుతోంది. హిందూపురం నుంచి రోజూ సగటున 50 టన్నుల పశుమాంసం తరలిస్తున్నట్లు సమాచారం. పశువులను వధించే వారు గోరంట్ల, అనంతపురంలోని పశువుల సంతల నుంచి పాడి, పోషణ, వ్యాపారం పేరుతో గేదెలు, ఆవులు, ఎద్దులు, దున్నలు కొనుగోలు చేస్తారు. పగటి పూట నేరుగా హిందూపురం తరలిస్తారు. రాత్రి వేళల్లో వధించి.. తెల్లవారేలోపు ప్యాకింగ్ చేస్తారు. కంటైనర్లలో ఎక్కించి పార్సిల్ వాహనాల తరహాలో పొరుగు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నారు. ఎద్దులు, లేగదూడలు, దున్నలు, ఆవులు కూడా వధిస్తున్నట్లు సమాచారం.
లోపించిన నిఘా..
హిందూపురం పట్టణంలోని రహమత్‌పురం, ఆజాద్ నగర్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆబాద్‌పేట, హస్నాబాద్, నింకంపల్లి తదితర ప్రాంతాల్లో పశు మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పగటి పూట కేవలం దున్నలు, ఎద్దుల మాంసం అందుబాటులో ఉంచుతారు. రాత్రి వేళల్లో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెంగళూరుకు టన్నుల కొద్దీ పంపిస్తున్నారు. కిలో రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో సుమారు 20 షాపుల్లో పశుమాంసం విక్రయిస్తున్నారు. హిందూపురంలో 100 మంది పైగా వ్యాపారులు పశుమాంస విక్రయాల్లో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. పోలీసు నిఘా లేకపోవడంతో పశుమాంసం విచ్చలవిడిగా తరలిపోతోంది.
నిబంధనలు తుంగలో తొక్కి..
హిందూపురం మాంసం దుకాణాల్లో చాలా రోజులుగా నిల్వ ఉంచిన సరుకు ఉంటుందనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పగటి పూట వధించిన పశువుల మాంసం మిగిలితే డ్రమ్ములు, ప్లాస్టిక్ సంచుల్లో నింపి రాత్రివేళల్లో కంటైనర్ల ద్వారా బెంగళూరుకు పంపిస్తున్నారు. వాహనాలను పట్టుకునే అధికారులు లేరు. పర్యవేక్షించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడరు. ప్యాకెట్లలో ఏ పశువు మాంసం ఉందో కూడా తెలియని స్థితి. నిబంధనలను తుంగలో తొక్కి పశుమాంసం విచ్చలవిడిగా తరలిస్తున్నారు.
టీడీపీ నేతలకు పర్సెంటేజీలు..
పశుమాంసం విక్రయాల గురించి బయట చెబితే ఇబ్బందులు పడతారని వ్యాపారులు డ్రైవర్లను బెదిరిస్తున్నట్లు సమాచారం. పశుమాంసం విక్రయాల్లో టీడీపీకి చెందిన కొందరు ప్రముఖులకు ప్రతి నెలా పర్సెంటేజీల రూపంలో కమీషన్లు వెళ్తున్నట్లు తెలిసింది. దీంతో ఏ అధికారి కూడా పశుమాంసం విక్రయదారులపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. హిందూపురంలో సుమారు 100 మంది పశు మాంసం వ్యాపారులు ఉన్నట్లు సమాచారం.
నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించవచ్చు
చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా గోవధకు పాల్పడినా, లేదా అనుమతి లేని పశువులను వధించినా ‘జంతు హింస నివారణ చట్టం –1960’, ఏపీ గోవధ నిషేధ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. దీనికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. అవసరమైతే పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) కూడా ప్రయోగిస్తారు. కానీ జిల్లాలో ఇంతలా పశుమాంసం అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఎవరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. ఇక పీడీయాక్ట్ ప్రయోగించవచ్చనే విషయమే అధికారులకు తెలియదు.
హిందూపురంపై
లోపించిన పోలీసు నిఘా
రాత్రి వేళల్లో పశుమాంసం
అక్రమ రవాణా
పగటి పూట సేకరించి
బెంగళూరుకు తరలింపు
గోరంట్ల, అనంతపురం
సంతల్లో పశువుల కొనుగోలు
షెడ్లలో గుట్టు చప్పుడు కాకుండా
వధ, ఆపై ప్యాకింగ్
కూటమి నేతల ఒత్తిళ్లతో ‘పురం’లో తూతూ మంత్రంగా గస్తీ
సరిహద్దు దాటాక పట్టుకుంటున్న కర్ణాటక పోలీసులు
చట్టం ఏం చెబుతోందంటే...
రాష్ట్రంలో ‘గోహత్య నిషేధం, జంతు సంరక్షణ చట్టం– 1977’ అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం ఆవులు, ఆవు దూడలు, గేదె దూడలు, ఒంటెల వధ నిషిద్ధం. కానీ ఎద్దులు, ముసలి గేదెలు వంటి ఇతర జంతువులను వధించేందుకు షరతులతో కూడిన అనుమతులున్నాయి. అది కూడా సదరు పశువు సంతానోత్పత్తికి, పాలు ఇవ్వడానికి, వ్యవసాయ/రవాణా పనులకు పనికిరాదని, ఆర్థికంగా లాభదాయకం కాదని అధికారి ధ్రువీకరిస్తూ వెటర్నరీ అధికారి సర్టిఫికెట్‌తో పాటు పశువైద్య అధికారి నుంచి లిఖిత పూర్వక ధ్రువీకరణ పత్రం పొందితేనే పశువులను వధించడానికి అనుమతి ఉంటుంది. సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనుమతించిన అధికారిక స్లాటర్ హౌస్‌లలో మాత్రమే వధ జరగాలి.


