ఎవరి పాపమో.. | - | Sakshi
Sakshi News home page

ఎవరి పాపమో..

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

తొమ్మిది నెలల ప్రతిరూపం ..

కళ్లముందు కనిపించగానే నిస్తేజం..

కడుపులోతన్నిన పాప పాదానికి రెండేవేళ్లు

అమ్మస్తనం అందుకోవాల్సిన పెదవికి చిరుగాట్లు

ఎవరి ‘పాప’మో...ఏం శాపమో

‘గ్రహణం’ పట్టిందా పాపకు

అమ్మో..నాన్నో..ఇంకెవరో...

ఈ ‘పాప’ తమకొద్దనుకున్నారు

పొత్తిళ్లలోని పాప సంచిలోకి చేరింది..

కళ్లుతెరవని ఆ ప్రాణం ముళ్లపొదలపాలైంది..

ఎవరో తల్లి అక్కునచేర్చుకుని ఊపిరి పోసింది

కానీ.. ఏ‘పాప’మూ తెలియని పాప భవిత

ప్రశ్నార్థకమైంది.

తనకల్లు: అప్పుడే పుట్టిన ఆడ శిశువును మండల పరిధిలోని చీకటిమానిపల్లి అంగన్‌వాడీ కేంద్రం వెనుకవైపు ఉన్న ముళ్ల పొదల్లో ఒక సంచిలో మూటకట్టి వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం ముళ్లపొదల్లో ఉన్న సంచిలో నుంచి పసికందు ఏడ్పులు వినిపించడంతో అటుగా వెళ్తున్న ఆదిలక్ష్మి అనే మహిళ సంచిని తెరిచి చూసింది. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువును చూసి జాలిపడి ఇంటికి తీసుకువెళ్లి పాలు పట్టి నిద్రపుచ్చింది. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త రెడ్డెమ్మ వెంటనే ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మీదేవికి సమాచారం అందించారు. దీంతో ఆమె ఆరోగ్య సిబ్బందితో కలిసి ఆదిలక్ష్మి ఇంటికి వచ్చి శిశువును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండల వైద్యాధికారి లోకేశ్వర్‌రెడ్డి పాపను పరీక్షించి ఉమ్మనీరు ఎక్కువగా తాగినట్లు గుర్తించారు. ఆయన సలహా మేరకు ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ లక్ష్మీదేవి చిన్నారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఓ పాదానికి రెండే వేళ్లు ఉండటం.. పైపెదవి చీలి ఉండటంతో పాపకు గ్రహణమొర్రి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement