పుట్టపర్తి: తీవ్ర వర్షాభావంతో పంటలన్నీ ఎండిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ శ్రీనివాసులు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పలువురు రైతులు సాగుచేసిన ఉద్యాన పంటలను పరిశీలించి సూచనలు చేశారు. తొలుత ఆయన బుక్కపట్నం మండలంలోని గూనిపల్లిలో మామిడి తోటలను పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి తోటలో అమర్చిన ఆటోమేషన్ యూనిట్‌ను పరిశీలించారు. ఈ యూనిట్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను ఆపరేట్ చేయవచ్చని, తద్వారా నీటి వృథాను అరికట్టవచ్చని, అంతేకాకుండా మొక్కకు ఎంత అవసరమో అంతే నీరు పెట్టవచ్చని రైతు తెలపడంతో ఆయన్ను అభినందించారు. అక్కడి నుంచి రాసింపల్లికి వెళ్లిన ఉద్యానశాఖ కమిషనర్... రైతు శ్రీనివాసులు సాగు చేస్తున్న మామిడి తోటలో ఏర్పాటు చేసిన వీడ్ మ్యాట్‌ను పరిశీలించారు. ఉపయోగాలను రైతు ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎల్–నినో ప్రభావాన్ని తట్టుకునే పీఎండీఎస్ విత్తనాల సాగు అవశ్యకతను రైతులు తెలుసుకోవాలన్నారు. నూతన సాగు పద్ధతులు అవలంభించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవానంద్, ఏపీఎంఐపీ పీడీ జయకుమార్ బాబు, హెచ్‌ఓ నవీన్ కుమార్, రైతులు ఉన్నారు.
8న ధర్మవరంలో
మెగా జాబ్‌మేళా
ప్రశాంతి నిలయం: యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం సెప్టెంబర్ 8న ధర్మవరంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జాబ్‌మేళా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాబ్‌మేళాలో టీసీఎస్, క్యాప్ జెమినీ, హెచ్‌సీఎల్ తదితర 100కుపైగా బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి బీటెక్, పీజీ, డిప్లొమా, డిగ్రీ, ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ వేతనం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ, జేడీఎం గీతారాణి తదితరులు పాల్గొన్నారు.


