ప్రశాంతి నిలయం: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి ఓటరు తుది జాబితా పక్కాగా రూపొందించాలని ఓటరు జాబితా జిల్లా పరిశీలకుడు డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఆయన.. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026 ప్రక్రియపై కలెక్టరేట్‌లోని మీనీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చేపడుతున్న కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ, ఓటరు జాబితా సవరణకు సంబంధించి అధికారులు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు పేరు తుది జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అనర్హులు, మృతులు, డబుల్ ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు తొలగించాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓలు, మున్సిపల్ అధికారులు, ఎన్నికల జాబితా సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
30న డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు ఈ నెల 30న అనంతపురంలోని కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.వి.లక్ష్మయ్య తెలిపారు. ఇన్‌స్టంట్ పరీక్షలకు అర్హత కలిగి, నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు ఆదివారం ఉదయం 10 గంటలకు కేఎస్‌ఎన్ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ 5వ సెమిస్టర్ హాల్ టికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, హాల్ టికెట్ లేకుండా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.


