పుట్టపర్తి అర్బన్: లక్షలాది మంది దాహం తీర్చిన భగవాన్ సత్యసాయి నడయాడిన పుట్టపర్తిలోనే తరచూ తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఏటికేడు పట్టణ జనాభా పెరుగుతుండటంతో రక్షిత మంచినీటి పథకాల సామర్థ్యం సరిపోవడం లేదు. ఇప్పుడు జనాభా...వందేళ్ల తర్వాత జనాభాను అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్టుగా బుక్కపట్నం చెరువు నుంచి నీరందించాలని భావించారు. అందుకు తగ్గట్టుగా అంచనా వేసి ప్రభుత్వానికి పంపగా అనుమతులూ వచ్చాయి. ‘నాన్ అమృత్ పథకం’ కింద పల్లె రఘునాథరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాగునీటి పథకానికి భూమి పూజ చేసి వదిలేశారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అప్పటి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ కూడా పచ్చజెండా ఊపడంతో పనులు ప్రారంభమయ్యాయి.
చకచకా పనులు..
ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పనులు చకాచకా చేయించారు. నాలుగు చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయించారు. అలాగే బుక్కపట్నం చెరువులో ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులూ ప్రారంభించారు. ఈ క్రమంలో రూ.18 కోట్లు ఖర్చు చేశారు. త్వరలోనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పుట్టపర్తి వాసులంతా ఆశపడ్డారు. కానీ ఆ తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగా...ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పుట్టపర్తికి నీరందించేందుకు తెచ్చిన భారీ పైపులన్నీ రోడ్ల పక్కన ఉండిపోయాయి.
పైపుల అపహరణ..
కేసు నమోదు చేయని పోలీసులు
పుట్టపర్తికి నీరందించేందుకు చేపట్టిన నాన్ అమృత్ స్కీం పనులు రెండేళ్లుగా ముందుకు సాగ లేదు. తాజాగా రెండు నెలల క్రితం బుక్కపట్నం చెరువు సమీపంలోని ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద మరోసారి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి భూమి పూజ చేసి హడావిడి చేశారు. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. ఇదే అదనుగా ‘తెలుగు తమ్ముళ్లు’ రోడ్డు పక్కన ఉన్న భారీ పైపులను, చిన్న, మధ్య తరహా సైజు పైపులను దొంగిలించి తరలించారు. గుజిరీకి విక్రయించి రూ.కోటి వరకూ లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల పైపుల అపహరణను గుర్తించిన కాంట్రాక్టర్ పుట్టపర్తి రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుకు ఎస్‌ఐ వెనుకంజ వేశారు. పైగా ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులంతా షాడో ఎమ్మెల్యే అనుచరగణమైన పచ్చమంద కావడంతో కాంట్రాక్టర్‌పైనే ప్రశ్న వర్షం కురిపించారు. ఫిద్యాదులో సమగ్ర వివరాలు లేవని, పైపులు తోలిన యజమాని రావాలని, అసలు పైపులు తోలారనే గ్యారెంటీ ఏమిటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి కంట్రాక్టర్‌ను బెంబేలెత్తించారు. దీంతో అతను మళ్లీ ఇప్పటివరకూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు.
కనీసం సీసీ కెమెరాలూ చూడలేరా..?
చోరీకి గురైన ఒక్కో పైపు 100 కిలో నుంచి 300 కిలోల బరువు ఉంటుంది. అంత పెద్ద పైపులను తరలించడానికి క్రెయిన్‌ను వినియోగించాల్సి ఉంది. దీంతో పాటు కర్ణాటకకు తరలించాలంటే భారీ లారీలు అవసరం ఉంటుంది. పుట్టపర్తి చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. పోలీసులకు నిజంగా దొంగలను పట్టుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే వారిని పట్టుకోవడం చాలా తేలిక. అయితే ప్రభుత్వ పెద్దల వత్తిడితో కేసు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.
పుట్టపర్తిలో మాయమైన
‘నాన్ అమృత్ స్కీం’ పైపులు
తెలుగు తమ్ముళ్లే అపహరించినట్లు
స్థానికుల అనుమానం
ఇదే విషయాన్ని పోలీసులకు
విన్నవించిన కాంట్రాక్టర్
ఎదురు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిన ఎస్‌ఐ
రూ.కోటి విలువైన పైపులు అపహరణ వెనుక షాడో ఎమ్మెల్యే అనుచరగణం


