అనంతపురం న్యూటౌన్: ‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం మంజూరు చేసిన తాగునీటి పథకాలను పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా మా గ్రామాల్లో ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు సరఫరా చేయండి’ అంటూ జెడ్పీ సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం చెర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, కలెక్టర్ ఓ.ఆనంద్, శ్రీ సత్యసాయి డీఆర్‌ఓ కొండయ్య, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఆయా శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా సమావేశానికి కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మాత్రమే హాజరుకావడం గమనార్హం. తమకు ప్రజా సమస్యలు వినేంత సమయం లేదన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
సభ్యులు లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పలేక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నీళ్లు నమిలారు. హిందూపురం ఎంపీ పార్థ మాట్లాడుతూ అధికారులపైనే నెపం నెట్టేందుకు యత్నించడం విమర్శలకు తావిచ్చింది. పైగా సభ్యులు అడిగిన ప్రతి సమస్యపై ఎంపీ జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్లలో ఏమి చేశారో చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని సభ్యులు నిరసించారు. పేరూరు డ్యాంలో నీటి లభ్యతపై అడిగిన ప్రశ్నకు ఎంపీ, చేసిన వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అర్బన్ పరిధిలో తాగునీటి పథకాలు అస్తవ్యస్తంగా మారాయని, వాటన్నిటిని రద్దు చేయాలంటూ కలెక్టర్‌ను కోరడం గమనార్హం. ఎంపీ, ఎమ్మెల్యే ప్రతి విషయంలో సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్ జపం చేయడాన్ని సభ్యులు వ్యతిరేకించారు.
ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పశువులకు ఎక్కడా మేత దొరకడం లేదు. గత జగన్ ప్రభుత్వం ఎంతోమందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయగా, రెండున్నర ఏళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఒక పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదు. ఈ విషయాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని పలువురు సభ్యులు కోరగా, అసలు చర్చే లేకపోవడం చూస్తే ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
జెడ్పీ సమావేశంలో
సభ్యుల మండిపాటు
నీళ్లు నమిలిన
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
చంద్రబాబు, లోకేష్‌ల జపంతో ఎంపీ, ఎమ్మెల్యే కాలయాపన
పంటల సాగుకు నీరివ్వబోమని తేల్చి చెప్పిన కలెక్టర్
ఇంకెన్ని సార్లు ఫిర్యాదు చేయాలి..?
బీకేఎస్ మండలం సిద్ధరాంపురంలో, వజ్రకరూరు మండలం కొనకొండ్ల తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదంటూ ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యులు నీలం భాస్కర్, తేజేశ్వరి వాపోయారు. అనంతపురం రూరల్ పరిధిలో పీఏబీఆర్ నుంచి పైప్‌లైన్ వేసేందుకు జగన్ ప్రభుత్వం రూ. 90 కోట్లు మంజూరు చేసిందని, అప్పట్లోనే 70 శాతం పనులు పూర్తయినా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోవడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యాయని జెడ్పీటీసీ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సవ్యంగా నడిచిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ఈ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారిందని, దీంతో నీటి కొరతతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారని గుడిబండ జెడ్పీటీసీ అనంతరాజు సభ దృష్టికి తీసుకొచ్చారు. గోడ కూలిన ఘటనలో మృతి చెందిన శెట్టూరు ఎస్సీ హాస్టల్ విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కంబదూరు జెడ్పీటీసీ గుద్దిళ్ల నాగరాజు డిమాండ్ చేశారు.
సాగుకు నీరివ్వడం కుదరదు: కలెక్టర్
కణేకల్లు చెరువు కింద ఆయకట్టుదారులు పోసుకున్న నారు ఎండిపోతున్న నేపథ్యంలో నీరివ్వాలంటూ కణేకల్లు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి కలెక్టర్ ఆనంద్‌ను కోరగా, ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. పంటల సాగుకు నీరివ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఈ ఏడాది వర్షాల కొరత కారణంగా హెచ్‌ఎల్‌సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నీటి కోటాల్లో భారీగా కోత పడిందని వెల్లడించారు. టీబీ డ్యాం నుంచి 16 టీఎంసీల నీరు మాత్రమే లభించే అవకాశం ఉందని, అందులో 9 నుంచి 10 శాతం టీఎంసీలు మాత్రమే నికరంగా వస్తాయని చెప్పారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం 8 నుంచి 9 టీఎంసీల నీరు పోగా, ఇక ఒక టీఎంసీ మాత్రమే మిగులుతుందని, దీంతో పంటలు పండించుకోవడం అసాధ్యం కాబట్టి రైతులు వరి, మిరప లాంటి పంటలు సాగుచేయరాదంటూ కలెక్టర్ సూచించారు.
వీటికి సమాధానాలేవీ..?
అంతా అధికారుల వల్లేనట!


