హిందూపురం టౌన్: జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్ కార్యక్రమంలో హిందూపురంలోని ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎన్‌డీజీఎస్ కళాశాలల విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆన్‌లైన్ ద్వారా వీక్షించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత, క్రీడాకారులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలు, యువత అభివృద్ధి, ఆరోగ్యం, ఫిట్‌నెస్, దేశ నిర్మాణంలో యువత పాత్ర వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని చిన్నారుల్లో సహజ క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. యువత డ్రగ్స్, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ అంజలీదేవి, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశులు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ యశోదారాణి, సత్యసాయి విద్యాసంస్థల వ్యాయామ అధ్యాపకురాలు విజయలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి రంగనాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం యూత్ ఐకాన్లు, స్పోర్ట్స్ ఐకాన్లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజలీదేవి సన్మానించారు. అదేవిధంగా ఎస్‌డీజీఎస్ కళాశాల విద్యార్థులు కూడా ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల ప్రెసిడెంట్ రేవూరి చంద్రమోహన్, కార్యదర్శి బైసాని రాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దాస సురేష్, ఉప కార్యదర్శి దాసా గంగాధర్, ప్రిన్సిపాళ్లు డాక్టర్ పోలయ్య, డాక్టర్ నాగేంద్రకుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజన్న పాల్గొన్నారు.


