కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సెప్టెంబర్ 4వ తేదీ శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు కలశపూజ ఉంటుందని, అనంతరం వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుందన్నారు. వ్రతంలో పాల్గొనాలనుకునే మహిళలు సెప్టెంబర్ 3వ తేదీలోపు తమపేర్లు ఆలయ ఈఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే వ్రతం ఆచరించాలనుకునే వారు తప్పనిసరిగా కలశం చెంబు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
నేపాల్ వరద బాధితుల కోసం ‘హెల్ప్‌లైన్’
ప్రశాంతి నిలయం: నేపాల్ వరదల్లో చిక్కుకున్న జిల్లా వాసుల కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వాసులు ఎవరైనా నేపాల్‌లో చిక్కుకున్నట్లయితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 08555289039కు సమాచారం అందిస్తే వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మాతా శిశుమరణాలను నివారించండి: కలెక్టర్
ప్రశాంతి నిలయం: గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించి మాతా శిశు మరణాలను నివారించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ జిల్లాలో సంభవించిన మాతృమరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణుల ఆరోగ్య వివరాలన్నీ డిజిటల్ ఫాంలో నమోదు చేయాలన్నారు. ఓపీడీ పరిశీలన సమయంలో వైద్యులు సమయం కేటాయించి గర్భిణులతో మాట్లాడి వారికి తగిన సలహాలు ఇవ్వాలన్నారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే అనర్థాలను వివరించాలన్నారు. జిల్లాలో సంభవించిన మాతృమరణాల కేసుల నివేదికలను నిపుణుల కమిటీ సమగ్రంగా విశ్లేషించి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాతాశిశు మరణాల నివారణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రక్తహీనత ఉన్న గర్భిణులందరికీ క్రమం తప్పకుండా ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు అందించాలని, హై–రిస్క్ గర్భిణులకు తప్పనిసరిగా టిఫా స్కాన్లు, అవసరమైన కేసుల్లో 2డీ–ఎకో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజా బేగం, డీసీహెచ్‌ఎస్ మధుసూదన్, డీఐఓ చెన్నారెడ్డి, పలువురు వైద్యులు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


