బడికి వెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకనే ఆలిగా, తల్లిగా బాధ్యతలు మోస్తున్నారు. సంసార సాగరం ఈదలేక కష్టాలతో సావాసం చేస్తున్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు | - | Sakshi
Sakshi News home page

బడికి వెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకనే ఆలిగా, తల్లిగా బాధ్యతలు మోస్తున్నారు. సంసార సాగరం ఈదలేక కష్టాలతో సావాసం చేస్తున్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

జిల్లాలో పెరిగిపోతున్న

బాల్య వివాహాలు

అధికారులు అడ్డుకుంటున్నా.. ఆగని తంతు

నగర, పట్టణాల కంటే గ్రామాల్లోనే అధికంగా

ఆర్థిక ఇబ్బందులు..

పిల్లల ప్రవర్తనతో పెళ్లిళ్లు

సాక్షి, పుట్టపర్తి: ఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేయాలనే ఆరాటం తల్లిదండ్రుల్లో ఎక్కువగా పెరిగిపోతోంది. ఆడపిల్ల పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని చాలా మంది భావిస్తూ వివాహాలు చేసేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అధికారులు పక్కా సమాచారంతో బాల్య వివాహాలను అడ్డుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నా చాలామంది తీరులో మార్పు రావడం లేదు. ఏటా 100 పైగా బాల్య వివాహాలను అధికారులు అడ్డుకుంటున్నా.. అంతకు మించి వివాహాలు జరుగుతున్న అంచనా.

గత ప్రభుత్వ

చర్యలతో మార్పు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బాలికా విద్యకు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారు. ఫలితంగా డ్రాపౌట్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి తోడు జగనన్న చేయూత లాంటి పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. పథకాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. వలసలు సైతం పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో బాలికలను చదివించేందుకే తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యతనిస్తూ రావడంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడుతూ వచ్చింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు, యువతులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయి. టీడీపీ అల్లరి మూకల చేష్టలతో తమ బిడ్డల భద్రతపై తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఆర్థిక ఇబ్బందులు.. పిల్లల ప్రవర్తనతో..

చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. పది, ఇంటర్‌ పూర్తి కాగానే చాలా గ్రామాల్లో అమ్మాయిలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. నగర, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరికొందరు సోషల్‌ మీడియాకు ప్రభావితులై చిన్న వయసులోనే పెడదోవ పడుతున్న కారణంగా బాల్యంలోనే వివాహం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

శిక్షలు ఇలా..

అమ్మాయి తండ్రితో పాటు అబ్బాయి తండ్రికి రూ.లక్ష చొప్పున జరిమానాతో పాటు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. అబ్బాయి మేజర్‌ అయితే అతడు కూడా శిక్షార్హుడే. మైనర్‌ అయితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తారు.

గతేడాది ఏప్రిల్‌లో ఇద్దరమ్మాయిలతో ఓ యువకుడి పెళ్లి పేరుతో ఓ వివాహ పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించగా.. ఆ ఇద్దరూ కవల పిల్లలని, అది కూడా మైనర్లని తేలింది. అధికారులు జోక్యం చేసుకుని పెళ్లి జరగకుండా అడ్డుకున్నారు. అయితే బాల్య వివాహాలు నేరమని ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా ఏమీ తెలియని వయసులోనే పెను భారాన్ని మోపుతున్నారు.

చట్టరీత్యా నేరం

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలి. గంటల వ్యవధిలో వచ్చి అడ్డుకుంటాం. బాల్య వివాహాల నియంత్రణ, బాలల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎలాంటి సమాచారం అయినా 1098 నంబరుకు తెలియజేయండి.

– ప్రమీల, ఐసీడీఎస్‌ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement