ప్రశాంతి నిలయం: ఆషాఢ ఏకాదశి వేడుకలు శుక్రవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి నెలకొంది. ఉదయం మహారాష్ట్ర, గోవాకు చెందిన బాలవికాస్ విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమృతం కంటే తియ్యనైన వాడివంటూ పాండు రంగడిని కొనియాడుతూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శన భక్తులను పరవశింపజేసింది. ‘ఆర్టిఫిషియల్ టు హార్టిఫిషియల్’ పేరుతో మహారాష్ట్ర సాయి యువత ఆధునిక సాంకేతిక యుగంలో మానవుడి జీవన విధానాన్ని వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు.
ప్రశాంతి నిలయానికి ఆషాఢ దిండి యాత్ర
ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర, గోవా భక్తులు చేపట్టిన ఆషాఢ దిండి యాత్ర శుక్రవారం ప్రశాంతి నిలయం చేరుకుంది. గోవా , మహారాష్ట్రకు చెందిన 2 వేల మంది భక్తులు దిండి నుంచి బయలుదేరి రైలు మార్గంలో ధర్మవరం చేరుకొని అక్కడి నుంచి పాదయాత్రగా 50 కిలోమీటర్లు నడిచి పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే వారికి ఘనంగా స్వాగతం పలికారు. విఠల రుక్మాయి పల్లకీని మోస్తూ ప్రశాంతి నిలయంలో జరిగిన ప్రదక్షిణలో పాల్గొన్నారు.


