ధర్మవరం: ‘‘చేనేతలపై సీఎం చంద్రబాబుది కపట ప్రేమ. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ‘నేతన్న నేస్తం’ పథకం పేరు మార్చి ‘నేతన్న సేవ’ పేరుతో రూ.25 వేలు అందిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. చేనేతల సంక్షేమంపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత రెండేళ్లుగా అటకెక్కించిన నేతన్న నేస్తం పథకం నిధులతో కలిపి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.75 వేల సాయం ఒకేసారి ఖాతాల్లో జమ చేయాలి’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన చేనేత కార్మికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కేతిరెడ్డితో కలిసి చేనేతలు, కార్యకర్తలు బైక్‌లపై స్థానిక శివానగర్ శివాలయం నుంచి నేతన్న విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గాంధీనగర్, కళాజ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్ మీదుగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా.. ఇంత వరకూ చేనేతలకు పైసా సాయం అందించిన పాపాన పోలేదన్నారు. ‘నేతన్న నేస్తం’ పథకం సాయాన్ని రూ.25 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు హామీలిచ్చిన కూటమి పార్టీల నాయకులు.. అధికారంలోకి వచ్చాక చేనేతలను పూర్తిగా విస్మరించారన్నారు. తీరా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడే సరికి పథకం పేరు మార్చి గడచిన రెండేళ్లు ఎగ్గొట్టి ఈ ఏడాది మాత్రం తూతూమంత్రంగా రూ.25 వేలు సాయం అందిస్తామని గొప్పలు చెప్పడం చేనేతలను వంచించడమేనన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలోచేనేత రంగ సంక్షోభంలో చిక్కుకుపోయిందని, ఉపాధి కోల్పోయిన కార్మికులు అప్పుల పాలై వాటిని తీర్చలేక బలవన్మరణం చెందారన్నారు. రెండేళ్లలో 52 మంది ఆత్మహత్యలు చేసుకున్నా... ఈ మొద్దు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పైసా సాయం ఇవ్వలేదన్నారు. 2014– 2019 మధ్య కాలంలో అప్పుల బాధతో చేనేతలు ఆత్మహత్య చేసుకుంటే... అప్పుడు కూడా చంద్రబాబు చోద్యం చూశారన్నారు. దీంతో తాను చేనేతల పక్షాన పట్టణంలో భిక్షాటన చేసి బాధిత చేనేత కుటుంబాలకు సాయం అందించానని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక 52 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందించామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చిత్తశుద్ధితో నేతన్నల సమస్యలు పరిష్కరించి చేనేత రంగానికి ప్రాణం పోయాలని కోరారు. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో ఒక్క చేనేత కార్మికుడు బలవన్మరణం చెందినా ఆ కార్మికుడి పాడెతోనే నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో చేనేత మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని కేతిరెడ్డి అన్నారు. పెరిగిన ముడిపట్టు ధరలు, పట్టుచీరలకు మద్దతు ధర లేక అవస్థలు పడుతుంటే మరోవైపు వ్యాపారులు సైతం షోరూం నిర్వాహకుల మోసాలతో అల్లాడిపోతున్నారన్నారు. షోరూంల నిర్వాహకులు వ్యాపారుల నుంచి రూ.కోట్ల విలువైన చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినా... ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో లీలా కళానికేతన్, ప్రస్తుతం ముగ్దా వంటి షోరూం నిర్వాహకులు చేస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనమన్నారు.
చేనేతల కోసం ఎంతకై నా... ఎందాకై నా సిద్ధమని కేతిరెడ్డి స్పష్టం చేశారు. నేతన్నలకు ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేనేత రంగ పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారిణి ఖతిజన్‌ఖుప్రాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, చేనేతలు, చేనేత సంఘం నాయకులు, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో లబ్ధికోసమే
‘నేతన్న సేవ’ పేరుతో హడావుడి
చిత్తశుద్ధి ఉంటే మూడేళ్ల నిధులు రూ.75 వేలు ఒకేసారి ఇవ్వాలి
చంద్రబాబు పాలనలో
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా నిలవాలి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్
చేనేతల సమస్యల పరిష్కారం కోసం ధర్మవరంలో భారీ ర్యాలీ
ఆర్డీఓ కార్యాలయం ఎదుట
పెద్ద ఎత్తున నిరసన
‘చేనేత’ మనుగడ ప్రశ్నార్థకం..
అండగా ఉంటా.. పోరాడతా..
తన హయాంలో ముడిపట్టు రాయితీ ప్రతినెలా రూ.600 ఇచ్చేందుకు కూడా చంద్రబాబుకు మనసు రాకపోతే... చేనేతల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేశామన్నారు. అప్పట్లో తన ఆధ్వర్యంలోనే చేనేతలు ఏకంగా 37రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే... ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్మవరం వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. అంతేకాకుండా ప్రతినెలా ఇచ్చే రూ.600 పరిహారాన్ని రూ.2 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని కేతిరెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు 2019 డిసెంబర్ 21న తన పుట్టినరోజు కానుకగా చేనేతలకు ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టి ఒకేసారి రూ.24 వేలు అందించారన్నారు. నిజంగా నేతన్నల నేస్తం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
కార్మికుల పాడెతోనే నిరసన తెలుపుతాం..


