మడకశిర రూరల్: ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రైతులకు శ్రేయస్కరమని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ఈ ఏడాది నెలకొన్న కరువు పరిస్థితులు వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ఆవకాశం ఉందన్నారు. గురువారం ఆయన అధికారులతో కలిసి ఆమిదాలగొందిలో పర్యటించారు. రైతులు అంజనప్ప, ఓబుళప్ప ప్రకృతి వ్యవసాయంలో భాగంగా విత్తన గుళికలతో ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విత్తన గొర్రు తోలి రైతుల్లో ఉత్సాహం నింపారు. అదే విధంగా రమేష్, లోకేష్, ఓంకారమ్మ తదితర రైతులు అమలు చేస్తున్న పీఎండీఎస్ విధానాన్ని, రైతు రజని ఏ–గ్రేడు కాటన్ మోడల్‌లో సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తగ్గుతుందని, పంటల నాణ్యత మెరుగ్గా ఉండటంతో పాటు వాతావరణ మార్పులకు పంట తట్టుకుంటుందన్నారు. తద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. అందువల్లే రైతులంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పూజారి ముకుంద, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు డీపీఎం లక్ష్మానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) కృష్ణయ్య, ఏడీ కృష్ణమీనన్, సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ నవీన్, మాస్టర్ ట్రైనర్ రమేష్, ఏఓ వీరనరేష్, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మా ఇంటి నుంచి
గెంటేశారు
● ఎమ్మెల్మే కందికుంట,
కదిరి రూరల్ సీఐ నాగేంద్ర
నా ఇంటికి కంచె వేయించారు
● సెల్ఫీ వీడియో విడుదల చేసిన
భాగ్యరాజ్
● కుటుంబంతో కలిసి
రైలు పట్టాలపై నిరసన
గాండ్లపెంట: ‘‘నమస్కారం సార్.. డిప్యూటీ సీఎం గారు, సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు. మమ్మల్ని మా ఇంటి నుంచి వెలేశారు. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మమ్మల్ని ఇంటి నుంచి ఖాళీ చేయించి..దౌర్జన్యంగా కంచె కట్టించి బయటకు పంపించారు. మా చావుకు బాధ్యులు ఎమ్మెల్యే వెంకటప్రసాద్, సీఐ నాగేంద్రే’’ అంటూ గాండ్లపెంట మండల పరిధిలోని కమతంపల్లికి చెందిన భాగ్యరాజ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అనంతరం నేరుగా రైలు పట్టాలపై కుటుంబంతో సహా పడుకుని మరో వీడియో విడుదల చేశాడు. తాము ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నామని, అయితే అధికారులు, ఎమ్మెల్యే ఏకమై తన ఇంటికి కంచె వేయించి, తమను ఇంటినుంచి వెళ్లగొట్టారని, దిక్కులేని పరిస్థితుల్లో సెల్ఫీ వీడియో విడుదల చేసి చావాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
హద్దులు ఏర్పాటు చేశాం...కంచె వేయలేదు
ఈ ఘటనపై తహసీల్దార్ నరసింహులు, వీఆర్వో రమణ స్పందించారు. కమతంపల్లి సర్వే నంబర్ 118లోని 44 సెంట్ల స్థలంపై సూర్యనారాయణరెడ్డికి, భాగ్యరాజ్ తండ్రి శ్రీనివాసులుకు మధ్య వివాదం నడుస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న సూర్యనారాయణరెడ్డి సర్వే కోసం చలానా కట్టడంతో సర్వే చేశామని, ఆర్‌ఎస్‌ఆర్ (రీ సెటిల్‌మెంట్ రికార్డు) వివరాల మేరకు ఎల్‌పీఎం 730లో 44 సెంట్లు సూర్యనారాయణరెడ్డి స్థలమని నిర్ధారించి హద్దులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకానీ తాము కంచె ఏర్పాటు చేయలేదని, భాగ్యరాజ్ కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పలేదని వివరణ ఇచ్చారు.


