వేతనం అందక.. పూటగడవక.. | - | Sakshi
Sakshi News home page

వేతనం అందక.. పూటగడవక..

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

‘శ్రీరామరెడ్డి’ పథకం కార్మికుడి

ఆత్మహత్యాయత్నం

గుడిబండ: వేలాది గ్రామాల్లోని లక్షలాది మందికి తాగునీరందించే శ్రీరామరెడ్డి పథకం కార్మికులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా 13 నెలలుగా వేతనం అందకపోవడంతో ఇప్పటికే తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. చివరకు అప్పులు ఇచ్చే వారు కూడా లేక జీవనం దుర్భరమై దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తాజాగా ఓ కార్మికుడు శ్రీరామరెడ్డి పథకం వాటర్‌ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మడకశిర నియోజకవర్గంలోని 375 గ్రామాలకు శ్రీరామరెడ్డి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద పనిచేసే 145 మంది కార్మికులకు 13 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ భారం మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గురువారం గుడిబండ మండలం కదిరేపల్లి గ్రామం పంచాయతీ గుర్రపుకొండ గ్రామానికి చెందిన సుబ్బరాజు బూదిపల్లి గ్రామం సమీపంలోని శ్రీరామరెడ్డి ఓవర్‌ హెడ్‌ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని సుబ్బరాజును నిలువరించి కిందకు దింపారు. ఈ సందర్భంగా కార్మికుడు సుబ్బరాజు మాట్లాడుతూ... తాను 14 ఏళ్లుగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పంప్‌హౌస్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, 13 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానన్నారు. కనీసం కుటుంబానికి భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యమని భావించి పైనుంచి కిందకు దూకేందుకు వాటర్‌ ట్యాంకు ఎక్కానన్నాడు. రాత్రనక, పగలనక కష్టపడి పనిచేస్తే కనీసం జీతం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తమకు సకాలంలో వేతనాలను అందించాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement