● సబ్సిడీ విత్తన వేరుశనగ ధరపై
రైతుల పెదవి విరుపు
● చంద్రబాబు సర్కారు తీరుపై
సర్వత్రా విమర్శలు
బత్తలపల్లి: చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ విత్తన వేరుశనగ ధరలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరొకర సబ్సిడీతో ఎలాంటి ఉపయోగం లేదంటూ పెదవి విరుస్తున్నారు. సబ్సిడీ పోనూ క్వింటాల్ విత్తన వేరుశనగ కాయల ధరను రాష్ట్ర ప్రభుత్వం రూ.6,120గా నిర్ణయించింది. అయితే బహిరంగ మార్కెట్‌లో ఈ ధరకే నాణ్యమైన విత్తన వేరుశనగ దొరుకుతుందని రైతులు చెబుతుండడం గమనార్హం. సబ్సిడీని పెంచి ఇంకా తక్కువ ధరకు విత్తనాన్ని అందించి కరువు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పెట్టుబడులకూ ఇబ్బందులు..
పది రోజులుగా తొలకర్లు పలకరిస్తుండటంతో వ్యవసాయానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈసారి సూపర్ ‘ఎల్–నినో’ ఉన్నందున ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరువు పరిస్థితుల నడుమ కష్టాలో ఉన్న రైతులు ఖరీఫ్‌లో పంట పెట్టుబడులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కింద పరిహారం ఇవ్వలేదు. ఈ క్రమంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం సబ్సిడీ విత్తన వేరుశనగతోనే భారం మోపడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
సాగుకు సిద్ధంగా ఉన్న పొలం


