పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు సర్కారు ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా హామీలు మాత్రం అమలు కావడం లేదు. మేనిఫెస్టోను చిత్తుకాగితంలా భావించిన బాబు సామాన్యుల నోట మట్టికొట్టారు. అధికారంలోకి వస్తే ప్రతి మహిళకూ రూ.1,500 ఇస్తానని 2024 సార్వత్రిక ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పటికీ పైసా విదల్చలేదు. ఆర్భాటంగా రెండు పథకాలకు శ్రీకారం చుట్టి మహిళలకు చుక్కలు చూపుతున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండానే ‘ఉచిత బస్సు’ అమలు చేసి మహిళలకు నరకం చూపిస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్‌లో అరకొరగా సబ్సిడీ డబ్బు అందజేస్తూ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
రెండేళ్లకే రోడ్డెక్కేలా చేశారు..
ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు గుప్పించిన చంద్రబాబు నేడు ఎగ్గొట్టేందుకు ఏవేవో సాకులు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై నమ్మకం లేని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మహిళలే కాదు.. టీచర్లు, సర్వేయర్లు, సచివాలయ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలు చంద్రబాబు సర్కారు తీరుపై మండిపడుతున్నాయంటే ఎంతలా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలా ఉంటే ఏదో ఉద్ధరించినట్టు మహిళా దినోత్సవం నిర్వహిస్తుండడంపై మహిళా లోకం మండిపడుతోంది.
గతంలో ప్రతి పథకం మహిళల కోసమే..
మహిళా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. గత ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాన్ని ప్రారంభించినా మహిళల కోసమే అన్నట్లుగా ఉండేది. ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేస్తూ వారి కళ్లలో ఆనందాన్ని చూశారు. ఇళ్లు పంపిణీ చేసినా మహిళల పేరుతోనే, ఇంటి పట్టాలు ఇచ్చినా మహిళల పేరుతోనే, భూ పంపిణీ చేసినా మహిళా రైతుల పేరుతోనే ఇలా ఒకటేమిటి వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం వంటి ఎన్నో పథకాలను మహిళలకు అందజేసి పేదింట నూతన కాంతులు వెల్లివిరిసేలా చేశారు.
జగన్ సంక్షేమం సాగిందిలా ..
వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా ఎన్నికల సమయం నాటికి డ్వాక్రా రుణాలు ఎంత ఉన్నా వాటిని నాలుగు విడతలుగా చేసి చెల్లించారు. ఇందులో భాగంగా జిల్లాలో 28127 ఎస్‌హెచ్‌జీలకు చెందిన 2,77,574 మంది సభ్యులకు రూ.863.06 కోట్లు చెల్లించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పేరుతో డ్వాక్రా సంఘాల మహిళలు ఎంత వడ్డీ చెల్లించినా ఆరు నెలలకు తిరిగి ఆ వడ్డీ మొత్తాన్ని సంఘం ఖాతాలకు జమ చేశారు. జిల్లాలో 30,360 గ్రూపులకు సంబంధించి రూ.195.25 కోట్లు ఖాతాల్లో జమయ్యాయి. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో భాగంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున 5 ఏళ్లకు రూ.75 వేలు అందజేశారు. ఇందులో భాగంగా జిల్లాలో అర్హులైన 6,961 మందికి ఐదేళ్లలో రూ.50.20 కోట్లు అందజేశారు.
● వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా 45– 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందజేశారు. మొత్తంగా జిల్లాలో 1,12,482 మందికి రూ.791.51 కోట్లు అందించి ఆనందం పంచారు.
● జగనన్న తోడు పథకంలో పేద మహిళా టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులుకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లకు రూ.50 వేలు అందజేశారు. జిల్లాలో 55,970 మందికి రూ.55.97 కోట్లు అందింది.
● వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకంలో జిల్లాలో 1,539 జంటలకు రూ.10.94 కోట్లు అందజేశారు. ఈబీసీ నేస్తం పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఈబీసీ మహిళలకు మూడు విడతల్లో 50,448 మందికి రూ.75.67 కోట్లు అందజేశారు. దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళలను ఆదుకున్నారు కాబట్టే ఇప్పటికీ వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళా లోకం జేజేలు పలుకుతోంది. మనసారా ఆశీర్వదిస్తోంది.
నేడు అంతర్జాతీయ మహిళా సదస్సు..
పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లోని ఎస్జీ కన్వెన్షన్ హాలు కల్యాణ మండపంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని ఆదేశించారు.
ఎన్నికల ముందు అలవిగాని హామీలతో
మభ్యపెట్టారు. అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారం చేపట్టాక మాత్రం
ఉత్తచేతులు చూపారు. సీఎం చంద్రబాబు చేసిన వంచనపై జిల్లావ్యాప్తంగా మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. మోసం చేసింది కాక అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరిట ఆర్భాటం చేస్తుండడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
మహిళా సంక్షేమానికి
తూట్లు పొడిచిన బాబు సర్కారు
జగన్ హయాంలో అమలైన
పథకాలను అటకెక్కించిన వైనం
వంచనపై మండిపడుతున్న
మహిళాలోకం
మహిళా దినోత్సవం పేరిట
ఆర్భాటంపై పెదవివిరుపు
చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదు. పేద మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బతుకు జీవుడా అంటూ బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆర్థికంగా కుటుంబాలను ఆదుకున్నారు. చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసి అండగా నిలిచారు. – లక్ష్మీనరసమ్మ,
జెడ్పీటీసీ సభ్యురాలు, పుట్టపర్తి


