ముదిగుబ్బ: తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని ఓ మహిళా ఉద్యోగిని ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఉదంతమిది. ముదిగుబ్బలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎంఈఓ వెంకటాచలపతి తెలిపిన మేరకు.. ముదిగుబ్బ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబా ఫిరోజ్‌కు స్థానిక ఎమ్మార్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న అబిదాభి ఆరు నెలల క్రితం రూ. 50 వేలు అప్పుగా ఇచ్చింది. అందులో రూ.25 వేలను బాబా ఫిరోజ్ తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో మిగిలిన డబ్బు కూడా ఇవ్వాలంటూ శనివారం పాఠశాలకు వెళ్లి బాబా ఫిరోజ్‌తో అబిదాభి గొడవకు దిగింది. ఉపాధ్యాయుడి ముఖంపై రాయితో దాడి చేయడంతో రక్తగాయాలయ్యాయి. ఈ విషయం డీఈఓ కిష్టప్ప దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంఈఓ వెంకటాచలపతి గొడవ పడిన ఇద్దరినీ పిలిపించి విచా రణ చేపట్టారు. ఎంఈఓ సమక్షంలో బాబా ఫిరోజ్ మిగిలిన రుణాన్ని అబిదాభికి అక్కడే చెల్లించాడు. ఉపాధ్యాయునిపై దాడి చేయడం సరికాదని తోటి ఉపాధ్యాయులు పేర్కొన్నారు. దాడి చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరారు.
ముత్యాలమ్మ ఆలయంలో చోరీ
● రెండేళ్లలో ఇది నాలుగోసారి
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోనూ ప్రఖ్యాతి గాంచిన రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తలుపులు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దుండగులు సుమారు రూ.లక్షకు పైగా విలువ చేసే అమ్మవారి వెండి ఆభరణాలను అపహరించారు. చంద్రబాబు ప్రభుత్వంఏర్పడిన ఈ రెండేళ్లలోనే నాలుగోసారి చోటు చేసుకున్న చోరీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఓ కుటుంబం కబంధహస్తాల్లో ఉన్న ఈ ఆలయాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేవదాయ శాఖ పరిధిలోకి చేర్చింది. అనంతరం ఆలయం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు వారి భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నారు. అయితే ఈ రెండేళ్లలో ఆలయానికి భద్రత కరువవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
కదిరి టౌన్: లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 10 తేదీన జరగనున్న రథోత్సవానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సతీష్‌కుమార్ శనివారం పరిశీలించారు. రథోత్సవానికి కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. రథోత్సవం సాగే మార్గంలో అవాంతరాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించి నిబంధనలు పాటిస్తూ రథోత్సవం విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణ స్వామి, ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, సీఐలు నారాయణరెడ్డి,నిరంజన్‌రెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
‘ఓపెన్’గా పరీక్ష..
ఇద్దరు అధికారులపై వేటు
మడకశిర: ఓపెన్ ఇంటర్ పరీక్షల విధుల నుంచి పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణ అధికారులను తొలగించినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ భాస్కర్ తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలు వారం రోజులుగా జరుగుతున్నాయి. మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందని పెనుకొండ డిప్యూటీ డీఈఓ జాన్‌రెడ్డప్ప దృష్టికి వెళ్లడంతో ఆయన శనివారం పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో బుక్‌లో చూసి రాస్తూ ఆయనకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో అధికారులపై జాన్‌రెడ్డప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు విద్యార్థులను బుక్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వారి ఆదేశాల మేరకు ఇద్దరినీ విధుల నుంచి తొలగించినట్లు ఎంఈఓ శ్రీనివాస్ భాస్కర్ తెలిపారు.


