రొళ్ల:లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో భూతప్ప ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. రోగాలతో బాధపడుతున్న వారు, సంతాన భాగ్యం లేని మహిళలు, పెళ్లిళ్లు కాని యువతులు తదితరులు వేకువజామునే భక్తిశ్రద్ధలతో చన్నీటి స్నానం ఆచరించి స్థానిక ఈరముద్దమ్మదేవి ఆలయం నుంచి నృసింహస్వామి ఆలయం వరకు రోడ్డు పొడవునా బోర్లా పడుకున్నారు. ముత్తరాయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాల నడుమ బయలు దేరిన భూతప్పలు నాట్యమాడుకుంటూ బోర్లా పడుకున్న మహిళలపై కాలు మోపుతూ ముందుకు సాగారు. తర్వాత భక్తులు రాశిగా పోసిన బొరుగులను భూతప్పలు భుజించారు. మిగిలిన బొరుగుల ప్రసాదాన్ని భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పంచిపెట్టారు.
పోటెత్తిన భక్త జనం..
భూతప్పస్వామి ఉత్సవాలను తిలకించడానికి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో రొళ్ల గ్రామం కిటకిటలాడింది. పోటెత్తిన భక్తజనంతో లక్ష్మీనృసింహ స్వామి ఆలయం కిక్కిరిసింది. వెండి, బంగారు ఆభరణాలు, పంచలోహ కవచాలతో అలంకరించిన స్వామి వారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. భక్తుల సౌకర్యార్థం దాతలు అన్నదానం ఏర్పాటు చేశారు. భూతప్పస్వామి ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మడకశిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, ఎస్‌ఐలు గౌతమి, రాజ్‌కుళ్లాయప్ప, ఏఎస్‌ఐ హిదాయితుల్లా తదితరుల ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.


