మోహినీ అవతారమెత్తిన శ్రీవారు | - | Sakshi
Sakshi News home page

మోహినీ అవతారమెత్తిన శ్రీవారు

Mar 8 2026 7:20 AM | Updated on Mar 8 2026 7:20 AM

కదిరి: భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన శనివారం స్వామివారు మోహినీ అవతారమెత్తారు.

శ్రీవారి కుచ్చుల వాలు జడ ప్రత్యేకం

మోహినీ అవతారంలోని శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం.దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి, అసురులను మభ్య పెట్టేందుకు శ్రీవారు మోహినీ అవతారం ఎత్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వయ్యారాలు ఒలకపోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. ధగ ధగా మెరిసే పట్టు చీరలో అందరినీ అకట్టుకొనే స్వామి వారిని గుభాళించే కదిరి మల్లెలతో అలంకరించారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలక్రిష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్‌ వెండి దండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

పట్టణమంతా ఊరేగనున్న శ్రీవారు..

తిరువీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిస్తారు. ఆదివారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై స్వామివారు తన భక్తులకు తిరువీధుల్లో దర్శనమిస్తారు.

భక్తులతో కిటకిట

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులతో నృసింహాలయం కిక్కిరిసిపోతోంది. గదులు ఖాళీగా లేకపోవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలో నేలపైనే నిద్రించడం కన్పించింది. ఆలయంలో ఉచిత అన్నదానం రాత్రింబవళ్లు కొనసాగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి రథోత్సవం ఈ నెల 10న జరగనుంది. ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement