అంగన్‌వాడీల సమర భేరి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సమర భేరి

Mar 2 2026 8:44 AM | Updated on Mar 2 2026 8:44 AM

అంగన్

అంగన్‌వాడీల సమర భేరి

తాడిపత్రి రూరల్‌: చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్‌వాడీలు సమర భేరి ప్రకటించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23 నుంచి 26 వరకు ప్రాజెక్టుల పరిధిలో రిలే నిరాహార దీక్షలు చేశారు. అలాగే 27న కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సోమవారం విజయవాడలో నిర్వహించనున్న మహా ధర్నాకు తరలివెళ్లారు. అయితే అంగన్‌వాడీలు మహాధర్నాలో పాల్గొనకుండా సీడీపీఓలు, సూపర్‌వైజర్లు బెదిరింపులకు దిగుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 10 వేలకు పైగా...

ఉమ్మడి అనంతపుం జిల్లాలో 10 వేల మందికి పైగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఉన్నారు. మొత్తం 5,125 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా అందులో అనంతపురం జిల్లాలో 2029 మెయిన్‌ అంగన్‌వాడీ సెంటర్లు, 223 మినీ సెంటర్లు ఉన్నాయి.

రెండు నాలుకల ధోరణి..

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని, అలాగే న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసినా తాము అడ్డుకోమని చెప్పిన బూటకపు మాటాలను అంగన్‌వాడీలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు అండ్‌ కో బూటకపు హామీలతో నిండా ముంచిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ వచ్చి 20 నెలలు దాటుతున్నా ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని, హామీలను అమలుకు గతంలో పలుమార్లు ధర్నాలు, నిరసనలు తెలియజేసినా ఏం ప్రయోజనం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు విజయవాడలో మహా ధర్నా పేరుతో కదం తొక్కుతున్నారు.

ధర్నాను అడ్డుకునేందుకు ఎత్తులు..

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే సోమవారం విజయవాడలో మహా ధర్నా చేపట్టనున్నారు. అయితే అంగన్‌వాడీలు ధర్నాలో పాల్గొనకుండా సీడీపీఓలు, సూపర్‌వైజర్ల ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. మహా ధర్నాకు వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వారి హెచ్చరికలతో ఒకవైపు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన చెందుతున్నారు. మహా ధర్నాకు మాత్రం వెళ్లి తీరుతామని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్‌వాడీలను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. విజయవాడకు వివిధ మార్గాల ద్వారా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు వెళ్లే అవకాశాలు ఉండటంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా ఉంచారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు కూడా వినియోగించుకుంటున్నారు. అంగన్‌వాడీ సెంటర్లను మూసివేసి ధర్నాకు వెళ్లే వారి వివరాలను సేకరించాలని వారికి పోలీసుశాఖ నుంచి అనధికార ఉత్తర్వులు వచ్చినట్లు తెలిసింది.

ఎన్నికలప్పుడు కూటమి నేతలు

ఇచ్చిన హామీలు

అంగన్‌వాడీలకు కనీసం నెలకు రూ.26 వేల వేతనం ఇస్తాం

గ్రాట్యూటీ అమలు చేస్తాం

అంగన్‌వాడీలకు పదోన్నతులు కల్పిస్తాం

పెండింగ్‌లో ఉన్న ఇంటి అద్దెలు, టీఏ బిల్లులు మంజూరు చేస్తాం

మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇస్తాం

తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తాం

ఎన్నికలకు ముందు చంద్రబాబు

అండ్‌ కో ఇచ్చిన హామీలు

అమలు చేయాలని డిమాండ్‌

నేడు విజయవాడలో మహా ధర్నా

బెదిరింపులకు దిగుతున్న

అధికారులు, పోలీసులు

బెదిరింపులకు భయపడం

చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్నా అంగన్‌వాడీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అందుకే మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చాము. అయితే చంద్రబాబు ప్రభుత్వం వివిధ రకాలుగా ధర్నాను అడ్డుకునేందుకు, అంగన్‌వాడీలపై బెదిరింపులకు దిగింది. వాటికి భయపడే ప్రసక్తేలేదు. ధర్నాను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమైన చర్య. న్యాయమైన హామీలను నేరవేర్చుకునేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

– రమాదేవి, ఉమ్మడి అనంతపురం జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నేత

ప్రభుత్వం మెడలు వంచుతాం

చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి వారు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాడుతాం. గతంతో టీడీపీ ప్రభుత్వం అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళలను అణిచివేయడానికి గుర్రాలతో తొక్కించినా భయపడలేదు. ప్రస్తుతం మహా ధర్నాను అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తోంది. అనేక రకాలుగా భయపడిస్తోంది. ధర్నాకు వెళ్లకుండా ఒత్తిడులు చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు.

– శకుంతల, అనంతపురం జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్‌

యూనియన్‌ అధ్యక్షురాలు

అంగన్‌వాడీల సమర భేరి 1
1/2

అంగన్‌వాడీల సమర భేరి

అంగన్‌వాడీల సమర భేరి 2
2/2

అంగన్‌వాడీల సమర భేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement