పిల్లలతో సహా తల్లీకూతుళ్ల అదృశ్యం
రొళ్ల: వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లీకూతురు సుబ్బమ్మ, లక్ష్మీ అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు.. రొళ్ల మండలం హెచ్‌టీ వడ్రహట్టిలో నివాసముండే రామప్ప, సుబ్బమ్మ దంపతులకు నలుగురు సంతానం. రామప్ప ఇప్పటికే మృతి చెందారు. మూడో కుమార్తె లక్ష్మీ అదే గ్రామానికి (హెచ్‌టీ హళ్లి వడ్రహట్టి) చెందిన వీరేష్‌ను ఇష్టపడటంతో 13 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. అయితే ఏడాదిగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇదే విషయంపై రెండు మూడు సార్లు పెద్ద మనుషుల సమక్షంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీలు చేసినా వీరేష్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గత నెల 27న ఉదయం వీరేష్ భార్య లక్ష్మీతో గొడవ పడ్డారు. ఇంట్లోనే ఉంటే నీ అంతు చూస్తానని ఆమెను బెదిరించాడు. వీటినన్నింటిని గమనించిన తల్లి సుబ్బమ్మ కుమార్తె లక్ష్మీతో పాటు మనవరాళ్లు రోహిణి, రచనలతో గత నెల 27న రాత్రి ఇంట్లో నుంచి ఎటో వెళ్లి పోయారు. గత నాలుగు రోజులుగా అన్నిచోట్లా గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీనికి కారణమైన వీరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుబ్బమ్మ పెద్ద కుమార్తె పార్వతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌతమి తెలిపారు. అదృశ్యమైన వారి ఆచూకీ తెలిస్తే 93475 52884, 95812 64001 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.


