వైఎస్సార్‌సీపీ నాయకుడి అరటి తోటకు నిప్పు
బత్తలపల్లి: వైఎస్సార్‌సీపీ నాయకుడి అరటి తోటకు దుండగులు నిప్పు పెట్టారు. పంట చేతికందే సమయంలో ఇలా జరగడంతో రూ.2 లక్షల దాకా నష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సింగమనేని వెంకటేష్ తన ఐదు ఎకరాల్లో 6 వేలకు పైగా అరటి మొక్కలను సాగు చేశాడు. ఇందులో తొలి పంట కోత పూర్తయింది. ఇటీవల రెండో పంట చేతికి వచ్చింది. మరో మూడు రోజుల్లో అరటి గెలలు కోద్దామని భావించాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం పొలంలో మంటలు రేగడం గమనించిన వెంకటేష్ కుమారుడు వెంటనే తన తండ్రికి సమాచారం అందించాడు. ఆయన గ్రామస్తులతో కలిసి పొలం వద్దకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ధర్మవరం నుంచి ఫైరింజన్ ఘటనాస్థలికి వచ్చే లోపే మూడు ఎకరాల్లోని నాలుగు వేల అరటి మొక్కలు కాలిపోయాయి. టమాట పంట సాగు చేయడానికి ఏర్పాటు చేసిన ట్యాటర్ కూడా కాలిపోయింది. దీంతో రూ.2 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటేష్ వాపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. బత్తలపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపడుతున్నారు.
మూడు ఎకరాల్లో పంట దగ్ధం
రూ.2 లక్షల నష్టం
వైఎస్సార్‌సీపీ నాయకుడి అరటి తోటకు నిప్పు


