కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు
శింగనమల: మండలంలోని సోదనపల్లి ఎస్సీ కాలనీ వాసులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో శింగనమల సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాగమ్మ, పెద్దక్క, రాజకుళ్లాయమ్మ, గంగేశ్వరి, శ్రావణ్, ఆంజినేయులు, జయమ్మ, నాగలక్ష్మి ఒకేసారి ఎనిమిది మంది ఆస్పత్రిలో చేరారు. శనివారం ముగ్గురు, శుక్రవారం ఒకరు చికిత్స పొందారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ పరిసరాల్లోని వారే చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వచ్చే వాటర్ ట్యాంక్‌కు వరి పొలాల మధ్యలోని బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. వాటర్ ట్యాంక్‌ను రెండేళ్లుగా శుభ్రం చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోతున్నారు. తాగడానికి మినరల్ వాటర్ వాడుతున్నామని, వంట చేసుకునేందుకు వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీరును వాడుతున్నామని మహిళలు తెలిపారు.


