బిల్లులు సరే.. నిర్మాణాల మాటేంటి? | - | Sakshi
Sakshi News home page

బిల్లులు సరే.. నిర్మాణాల మాటేంటి?

Feb 23 2026 6:53 AM | Updated on Feb 23 2026 6:53 AM

బిల్ల

బిల్లులు సరే.. నిర్మాణాల మాటేంటి?

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా కేంద్రమైన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల కోసం చేపట్టిన పనులు మూడు నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తికాలేదు. దీంతో ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా నిర్మాణాలు పూర్తికాకుండానే బిల్లుల కోసం కొందరు టీడీపీ నేతలు చక్రం తిప్పుతుండటంపై సర్వత్రా విమర్శలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సైతం నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పకపోవడం సరికాదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ పనులతో పాటు అక్కడక్కడా దాతలు చేయించిన పనులను సైతం అసంపూర్తిగా ఉన్నాయంటున్నారు.

పనులు పూర్తికాకుండానే...

పుట్టపర్తిలో హారతి హాట్‌ వద్ద నుంచి దుర్గమ్మ ఆలయం వరకూ రోడ్డు ఉంది. దీనికి అదనంగా రోడ్డు వేయడానికి మట్టి, కంకర లేయర్లు వేశారు. అయితే తారు వేయడం మరచి పోయారు. దీంతో వాహనాలు వేగంగా వెళ్తుంటే కంకర రాళ్లు, మట్టి మీద పడుతున్నాయని స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే పని పూర్తవుతుందని, అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అలాగే ఆర్టీసీ డిపో వద్ద చిన్న పార్కు నిర్మించడానికి సిద్ధం చేశారు. ప్రహరీ నిర్మించారు. గేటు అమర్చారు. పార్కు లోపలి భాగంలో రోడ్లు ఏర్పాటు చేశారు. ఒక మొక్క గాని, పచ్చిక గాని ఏర్పాటు చేయలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి దీన్ని నవంబర్‌లోనే ప్రారంభోత్సవం చేసి శిలాఫలకం వేయించుకున్నారు. ఇది అక్రమ నిర్మాణమని ఇరిగేషన్‌శాఖ నోటీసు బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గేటుకు తాళం వేసి మూసేశారు.

బిల్లుల మంజూరుకు ఎత్తులు

పుట్టపర్తి మున్సిపాలిటీలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో వివిధ అభివృద్ధి పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లు ఇటీవల కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం తీసుకున్న వెంటనే మున్సిపల కమిషనర్‌కు ఫోన్‌ చేసి బిల్లులు చేయాలని ఆదేశించారు. దీంతో పనులు పూర్తయినవీ, పూర్తి కాని వాటికీ బిల్లులు చేయించుకునేందుకు కూటమి నాయకులు ఎత్తులు వేస్తున్నారు. గతంలో అక్రమ బిల్లులు చేయమంటున్నారని మున్సిపల్‌ కమిషనర్‌ లాంగ్‌ లీవ్‌లో వెళ్లారు. అయితీ మళ్లీ అదే కమీషనర్‌ను తీసుకొచ్చి బిల్లులు చేయించుకునేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. ఏది ఏమైనా నిర్మాణ పనులు పూర్తయ్యాయా.. పెండింగ్‌లో ఉన్నాయో.. చూడకుండా బిల్లులు చేస్తే మాత్రం ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లేనని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారు.

సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ముగిసి మూడు నెలలైనా

పట్టించుకోని ప్రభుత్వం

నేటికీ పూర్తి కాని అభివృద్ధి పనులు

బిల్లులు చేసుకునేందుకు చక్రం

తిప్పుతున్న టీడీపీ నేతలు

బిల్లులు సరే.. నిర్మాణాల మాటేంటి? 1
1/1

బిల్లులు సరే.. నిర్మాణాల మాటేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement