మైస్ విల్లాస్‌లో దొంగల హల్‌చల్
అనంతపురం సెంట్రల్: నగర శివారు జాతీయ రహదారి పక్కన మైస్ విల్లాస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఐదు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు... రుద్రంపేట నుంచి రాప్తాడు వెళ్లే మార్గంలో మైస్ విల్లాస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఐదు ఇళ్లలో దొంగలు చొరబడి అందినకాటికి దోచుకెళ్లారు. కేవలం తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. విల్లాలోని కార్యాలయంలోకి వెళ్లిన దొంగలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యారు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న చింతల రామపుల్లారెడ్డి అనే వ్యక్తి ఇంట్లోనే 12 తులాలు, రూ. 6.30 లక్షల నగదు, వెండి వస్తువులు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఈయన కుటుంబంతో సహా విజయవాడకు వెళ్లారు. మరికొందరి ఇళ్లలో కూడా బీరువాలు పగలగొట్టి బంగారు, విలువైన వస్తువులు, నగదు దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దాదాపు రూ.40 లక్షల వరకూ దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న నాల్గవ పట్టణ సీఐ జగదీష్ ఘటనా స్థలానికి వెళ్లారు.


