ఆలుగడ్డ సాగుపై రైతుల ఆసక్తి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని రైతులు ఆలుగడ్డ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సీజన్ ప్రారంభం కాగా... జిల్లా వ్యాప్తంగా 450 హెక్టార్లలో అన్నదాతలు సాగు చేశారు. సాధారణంగా అక్టోబర్ మొదటి వారంలో సాగు ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తారు. ఈ సమయంలో వీటికి మంచి ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు.
రెండేళ్లుగా ధరల పతనం
గత రెండేళ్ల నుంచి ఆలుగడ్డల ధరలు పతనమవుతున్నాయి. రెండేళ్ల కిందట 40 కిలోల బస్తా రూ.1500 ఉండగా ప్రస్తుతం రూ.1100 నుంచి రూ.1200 పలుకుతోంది. ఆలుగడ్డ పంట తక్కువ నీటితోనే పూర్తవుతుంది. మంచు సమయంలో సాగవుతుండడంతో మంచునీటికే బాగా పంట దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.
25,212 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు
జిల్లాలో ఖరీఫ్ ,రబీ పంటలకు మంచి వాతావరణం, నీళ్లు తోడుండడంతో రైతులు కూరగాయలు, టమాటాలు, బెండ, వంకాయ, ఆలుగడ్డ, కాకర, అనపకాయలు, క్యాబేజీ, చిక్కుడు, మిరప, బీట్‌రూట్ తదితర పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేసినట్లు ఉద్యానవనశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని వారాంతపు మార్కెట్లతో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు, తదితర పట్టణాల్లోని మార్కెట్లతో పాటు బాగేపల్లి, చింతామణి, మదనపల్లి, బెంగళూరు, చైన్నె వంటి పెద్ద మార్కెట్లకు పంట ఉత్పత్తులను విక్రయించి లబ్ధి పొందుతున్నారు. ధరలు అధికంగా ఉన్న సమయాల్లో వ్యాపారులు తోటల వద్దకే వచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం టమాటా పంటలకు గిట్టుబాటు లేకపోవడంతో కొంత మంది రైతులు నిరాశలో ఉండగా ఆలుగడ్డ సాగు చేసిన రైతులు మాత్రం ఆనందంగా ఉన్నారు.
ఆలుగడ్డ సాగుకు ఖర్చు అధికమే
ఆలుగడ్డ సాగు చేసే రైతులు ఎకరకు సుమారు రూ.60 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా విత్తనం గడ్డ 50 కిలోల బస్తా సీజన్‌ను బట్టి రూ.1200 వరకూ ఉంటుంది. భూమి సాగు చేయడం, గడ్డి తొలగించడం, విత్తనం పెట్టడం, డ్రిప్ ద్వారా ఎరువులు, సాల్లు తీయడం, ఎరువులు పంట చివర్లో దున్ని గడ్డలను తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. మొత్తం కలిపి సుమారు రూ.60 వేల వరకూ ఖర్చు వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం 40 కిలోల బస్తా ఆలుగడ్డలు రూ.1200 కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ఎకరాకు 100 బస్తాల వరకూ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ధరను పోల్చుకుంటే 100 బస్తాలకు రూ.1200 ధరతో రూ. 60 వేలు ఆదాయం వచ్చినట్లు పెడపల్లి రైతులు చెబుతున్నారు. ఆలుగడ్డలను చిప్స్, లేస్, ఫింగర్ చిప్స్ తదితర బేకరీ ఐటమ్స్‌తో పాటు నిత్యం గ్రామాల్లో వంటలు, కూరలకు వినియోగిస్తుంటారు.
జిల్లాలో 450 హెక్టార్లలో సాగు
ఎకరాకు సుమారు
రూ.60 వేల వరకూ ఖర్చు
ఆలుగడ్డ సాగుపై రైతుల ఆసక్తి
ఆలుగడ్డ సాగుపై రైతుల ఆసక్తి


