విద్యుత్ స్తంభం పై నుంచి పడి యువకుడి మృతి
కదిరి అర్బన్: విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన పట్నం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలమేరకు... కదిరి మండలం రాచువారిపల్లితండాకు చెందిన సాయికుమార్‌నాయక్ (29) విద్యుత్‌శాఖ కాంట్రాక్టర్ వద్ద కూలి పనులకు వెళ్లేవాడు. పట్నం వద్ద ముదిగుబ్బ మండలానికి సంబంధించి 33 కేవీ లైన్ మార్చే పనులకు వెళ్లాడు. విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘానికి గురై కింద పడినట్లు తెలిపారు. వెంటనే కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయికుమార్‌నాయక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
న్యాయం చేయాలని ధర్నా
తమ కుమారుడి మృతికి విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సాయికుమార్‌నాయక్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. అధికారులు వచ్చి తమకు న్యాయం చేయకపోతే పోస్టుమార్టం చేయనీయమని అడ్డుకున్నారు. ఆస్పత్రి ముందు కదిరి – హిందూపురం రహదారిపై ధర్నా చేశారు. ధర్నా వద్దకు పట్టణ, రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్టేషన్ల సీఐలు నారాయణరెడ్డి, నిరంజన్‌రెడ్డి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి ధర్నా విరమింపచేశారు. తమకు ఆసరాగా ఉన్న కుమారుడు దుర్మరణం చెందడంతో మృతుడి తల్లిదండ్రులు గంగేనాయక్, అస్లీబాయ్ కుమరుడి మృతదేహంపై పడి బోరున విలపించారు. గంగేనాయక్, అస్లీబాయ్‌లకు ఇద్దరు సంతానం కాగా సాయికుమార్‌నాయక్ చిన్నకుమారుడు. తన తమ్ముడి చావుకు ట్రాన్స్‌కో ఏడీఈ వరప్రసాద్‌రెడ్డి, ముదిగుబ్బ ఏఈ సాయితేజ, లైన్‌మెన్ అనంత్, విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న రాజగోపాల్, నరేష్ నిర్లక్ష్యమే కారణమని మృతుడి అన్న చిన్నప్పనాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ట్రాక్టర్ బోల్తా ..
యువకుడి మృతి
శింగనమల (నార్పల): నార్పల మండలంలోని పులసలనూతల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్లె మహేంద్ర (22) మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... పులసలనూతలకు చెందిన పల్లె సూర్యనారాయణ కుమారుడు మహేంద్ర తన ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలోని మట్టిని తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో మహేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మహేంద్రకు రెండు సంవత్సరాల క్రితం వివామైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.
విద్యుత్ స్తంభం పై నుంచి పడి యువకుడి మృతి


