30 శాతం మధ్యంతర భృతి ప్రకటించండి
పెనుకొండ: ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు సంబంధించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పెనుకొండ పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కాడిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. నేడు మొండి చేయి చూపుతోందన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్ అమలు కావాల్సి ఉండగా.. రెండున్నరేళ్లుగా పీఆర్‌సీ కమిషన్‌ను నియమించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే జనవరి నుంచి మరో డీఏ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్‌సీ, డీఏలు సకాలంలో ఇవ్వకపోవడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సరెండర్ బిల్లులు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బోధనేత పనులు, యాప్‌ల భారం తగ్గించాలని విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మారుతీప్రసాద్, ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


