ఐక్యతతోనే కురుబల అభివృద్ధి
అనంతపురం టవర్‌క్లాక్: ఐక్యతతోనే కురుబల అభివృద్ధి సాధ్యం. కురుబలు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి విద్యావంతులు చేయాలని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక కనక దాస కల్యాణ మంటపంలో ఉమ్మడి అనంతపురం జిల్లాల కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కురుబ కులంలో జేఈ, డీఎస్సీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఉద్యోగాలు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలు అందివ్వడంతో పాటు నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మేయర్ రాగే పరుశురాం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కురుబలు ఎంత కష్టం వచ్చినా సరే పిల్లలను చదివించాలని, అందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కురుబ సంక్షేమ సంఘం, ఉద్యోగా సంఘాలను ఆశ్రయించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనపరిచిన పిల్లలకు పురస్కారాలు అందిస్తామమన్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగాలు సాధించిన 104 మందికి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు, సీపీఐ నాయకుడు జగదీష్, శివబాల, డాక్టర్ మహేష్, బోరంపల్లి ఆంజనేయులు, రుచీస్ హోటల్ వెంకటరమణ, బ్యాళ్ల నాగేంద్ర, కాణపాకం ఆలయం డైరెక్టర్ వసంతమ్మ, కృష్ణమూర్తి, నెమలివరం ఈశ్వరయ్య, విఠల్ గౌడ్ పాల్గొన్నారు.


