
చంటి బిడ్డతో వేచివున్నా.. ఆపని బస్సులు
బత్తలపల్లి: బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు శనివారం ఉదయం 11.30 గంటలకు ఓ మహిళ చంటి బిడ్డతో ధర్మవరం వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డుపైనే ఎండలో వేచి ఉంది. బస్సులు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి. వచ్చిన ప్రతి బస్సునూ ఆ మహిళ ఆపేందుకు చేయి ఎత్తుతోంది. బస్సు డ్రైవర్లు మాత్రం చూసి కూడా ఆపకుండానే వెళ్లిపోతున్నారు. ఫ్రీ టికెట్..ఎందుకు ఆపాలని అనుకున్నారో ఏమో..చంటి బిడ్డతో వేచి ఉందన్న కనీస మానవత్వం కూడా లేకుండానే వెళ్లిపోయారు. ఇలా ఐదు బస్సులు వెళ్లాయి. అప్పటికి 12 గంటలు అయింది. చివరికి అక్కడున్న వారికి ఈ తతంగం ఆగ్రహం తెప్పించింది. ఆ సమయంలో ధర్మవరం డిపోకు చెందిన ధర్మవరం–పులివెందుల బస్సు వచ్చింది. ఆ బస్సు కూడా ఆపకుండా వెళుతుండడంతో స్థానికులు ద్విచక్ర వాహనంలో వెంబడించారు. జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. ఓ మహిళ చంటి బిడ్డతో ఎండలో ఉందన్న మానవత్వం కూడా లేకుండా ఎలా వెళ్లిపోతారంటూ నిలదీశారు. తర్వాత ఆ మహిళను బస్సులో ఎక్కించి పంపించారు. మహిళలకు ఎలాగూ ఫ్రీనే కదా అనే ఉద్దేశంతో చాలావరకు బస్సులు ఆపడంలేదని పలువురు తెలిపారు. ఇకనైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
అప్పుల బాధతో చేనేత
కార్మికుడి ఆత్మహత్య
బత్తలపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మికుడు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బత్తలపల్లి ఏఎస్‌ఐ సోమశేఖరమూర్తి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన లక్ష్మన్న కుమారుడు చిట్రా రమేష్(34) ఇంట్లోనే చేతి మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ముడి సరుకులు ధర పెరగడంతో కూలి గిట్టుబాటుకాక జీవనం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం లేకపోవడంతో కుటుంబ పోషణకు రమేష్ తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వడ్డీలతో కలిపి అప్పు మొత్తం పెరుగుతుండగా...తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మగ్గం పక్కనపెట్టిన రమేష్ గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటున్నాడు. కూలి డబ్బులు కుటుంబ పోషణకే సరిపోతుండటంతో అప్పులు తీర్చలేక ఇబ్బందిపడేవాడు. అప్పులు తీర్చేమార్గం కనిపించక జీవితంపై విరక్తి చెందిన రమేష్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉన్న ఇనుప దూలానికి చీరతో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చిన కూతురు దూలానికి వేలాడుతున్న రమేష్‌ను చూసి బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి చీరను కోసి రమేష్‌ను కిందకు దించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు గమనించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ సోమశేఖరమూర్తి సిబ్బందితో గ్రామానికి చేరుకుని మృతుని భార్యతో వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

చంటి బిడ్డతో వేచివున్నా.. ఆపని బస్సులు