
డీఎస్సీ కాల్‌లెటర్ల వెనుక కథలెన్నో..
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25లో మెరిట్ సాధించిన చాలామంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు మెసేజ్‌లు (కాల్ లెటర్లు) రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. మెరిట్ సాధించి ఎంపికై న అభ్యర్థులకు గురువారం అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఎవరికై తే మెసేజ్ అందుతుందో వారు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలంటూ చెప్పారు. అయితే చాలామంది మెరిట్ జాబితాలో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కూడా మెసేజ్‌లు రాకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. మెసేజ్‌లు రాకపోయినా అక్కడికి చేరుకున్నారు. జిల్లా పరిశీలకులు, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబును కలిసి విన్నవించారు. రాష్ట్ర కార్యాలయం నుంచి తొలిరోజు 625 మంది అభ్యర్థులకు సంబంధించిన సమాచారం మాత్రమే వచ్చిందని, తక్కిన వారికి శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వారు స్పష్టం చేశారు. కాగా, సర్టిఫికెట్ల పరిశీలనకు డీఈఓ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి 10.30 గంటలకు ముగిసింది. తొలిరోజు ఐదుగురు గైర్హాజరయ్యారు. వారికి సర్టిఫికెట్ల పరిశీలనకు శుక్రవారం కూడా అవకాశం ఇస్తున్నట్లు డీఈఓ తెలిపారు. శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రాత్రి 10 గంటల సమయానికి 132 మంది జాబితా జిల్లా విద్యాశాఖ అధికారులకు చేరింది. వారందరూ ఉదయం 9 గంటలకు హాజరుకానున్నారు.
తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి..
తమకంటే తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కాల్‌లెటర్లు వచ్చాయని, తమకు రాలేదంటూ కొందరు అభ్యర్థులు వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేశారు. ఒకే సబ్జెక్టు ఒకే కేటగిరీలో తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కాల్‌లెటర్లు వచ్చినా ఎక్కువ ర్యాంకులు సాధించిన వారికి కాల్‌లెటర్లు రాలేదు. అధికారులను అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని, వెబ్‌సైట్‌లో ఉంచిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్లు చేసినా కనీస స్పందన లేదంటూ ఆయా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిశీలకులు, స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావును కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
డీఎస్సీ–25కి ఎంపికై న
అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన
807 పోస్టులకు గాను తొలిరోజు
625 మంది అభ్యర్థులకు మెసేజ్‌లు
తక్కువ ర్యాంకులు వచ్చిన వారిని పిలిచారంటూ మెరిట్ అభ్యర్థుల ఆవేదన
తొలిరోజు పకడ్బందీగా
సర్టిఫికెట్ల పరిశీలన

డీఎస్సీ కాల్‌లెటర్ల వెనుక కథలెన్నో..