
మెరుగైన వైద్య సేవలందించండి
బత్తలపల్లి/ ధర్మవరం అర్బన్: ఆరోగ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. తొలుత ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ గదిలోని మందుల వివరాలు, స్టాకు, ఓపీ రిజిష్టర్, ఆన్‌లైన్‌లో ఈహెచ్‌ఆర్ నమోదు, ల్యాబ్‌లో రక్తపరీక్షల వివరాలు పరిశీలించారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ అరుణ్‌కుమార్‌తో ఆస్పత్రిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల వివరాలు, వాటి ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.
● ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న ఫేజ్–2 సబ్ డిస్ట్రిక్ లెవెల్ ఎన్‌సీడీ 4.0 శిక్షణ కార్యక్రమాన్ని గురువారం డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు ప్రతి ఇంటికీ వెళ్లి 18 సంవత్సరాలు పైబడిన వారికి అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించాలన్నారు. క్యాన్సర్ లక్షణాల గల వారిని తొలి దశలోనే గుర్తించి వారికి అవసరమైన మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర నాయక్, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ వివేక్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పద్మమణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సాంబశివమ్మ, వన్నప్ప తదితరులు పాల్గొన్నారు.