
ముందుకు సాగని పీ–4
పుట్టపర్తి అర్బన్: పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పీ–4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు లక్ష్యం ముందుకు సాగడం లేదు. ఆర్థికంగా బాగున్న వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్‌ఆర్‌ఐలు, నాయకులు (మార్గదర్శకులు) వారికి తోచిన విధంగా కొన్ని పేద కుటుంబాలను దత్తతకు తీసుకొని జీవన ప్రమాణాలు మెరుగుపరచి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. 2029 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఒక్కో మార్గదర్శకుడు కనీసం నాలుగు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ సర్వే చేసి గ్రామ సభ నిర్వహించి బంగారు కుటుంబాలను గుర్తించాల్సి ఉంది. అయితే సర్వేలు, గ్రామ సభలు సరిగా చేపట్టకపోవడంతో కార్యక్రమం నీరుగారింది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 38,513 బంగారు కుటుంబాలు, 5,700 మంది మార్గదర్శకులను గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తక్కిన కుటుంబాలను త్వరలో గుర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అంటున్నారు. ప్రతి వారం అధికారులతో కలెక్టర్ సమావేశాలు నిర్వహించి మార్గదర్శనం చేస్తున్నా... ఏ మండలంలో ఎంత మందిని, ఏ గ్రామంలో ఎవరిని గుర్తించారనే వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేకపోతున్నారు.
ముందుకురాని ఉద్యోగులు..
పీ–4 కార్యక్రమంలో భాగంగా పేదలను ఆదుకునేందుకు ఉద్యోగులు ఒక్కరూ ముందుకు రాలేదు. రాలేమంటూ కొందరు గంటాపథంగా చెప్తున్నారు. సర్వేలోనూ పాల్గొనబోమని కరాఖండిగా చెప్పారు. ఈ తరుణంలో సంబంధిత అధికారులు లక్ష్యాలను చేరుకోలేక తలలు పట్టుకుంటున్నారు.
పేదల దత్తతకు ముందుకురాని
మార్గదర్శకులు