
రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ యోగా పోటీలకు ‘అనంత’ ఆతిథ్యం
అనంతపురం కల్చరల్: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగా పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో జిల్లాలో నిర్వహించనున్నట్లు వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన యోగా పోటీల్లో జిల్లాకు చెందిన యోగాభ్యాసకులు మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించి, సెప్టెంబర్ 11న భిలాయ్‌లో, అదే నెలలో 27న విజయవాడలో జరిగే జాతీయ స్థాయిలో యోగా పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ చాటిన యోగాభ్యసకులను గురువారం అనంతపురంలోని షిరిడినగర్ వివేకానంద యోగ భవన్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో యోగా గురువులు దివాకర్, పుల్లయ్య, మారుతీప్రసాద్, తారక్, నాని నవోమిన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణాలు బలిగొన్న అతి వేగం
● ద్విచక్ర వాహనం అదుపు తప్పి
కిందపడి వ్యక్తి మృతి
ధర్మవరం అర్బన్: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన అక్కం సతీష్‌కుమార్(36), కవిత దంపతులు మగ్గం పనితో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో సతీష్‌కుమార్ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఆయన తమ్ముడు అనిల్‌కుమార్ ఇంటికి చేరుకుని అన్న లేకపోవడంతో ఫోన్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పెట్రోల్ తీసుకు రావాలని కోరాడు. దీంతో పనిముగించుకున్న అనంతరం సతీష్‌కుమార్ పెట్రోల్ తీసుకుని ఇంటికి వెళుతూ చికెన్ సెంటర్ వద్ద మలుపు వద్ద వేగాన్ని నియంత్రణ చేసుకోలేక అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడుని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.
ఒంటరితనం భరించలేక
వివాహిత బలవన్మరణం
పరిగి: ఒంటరి తనం భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురం పట్టణ ట్రాఫిక్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సంపత్‌కుమార్‌కు భార్య లీలావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని సేవామందిరంంలో నివాసముంటున్నారు. చిన్న కుమార్తె ప్రియాసాయి (26) కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది సజావుగా సాగిన కాపురం అనంతరం విభేదాల కారణంగా కోర్టు ద్వారా విడాకులు పొందారు. మూడేళ్ల క్రితం తల్లి లీలావతి మృతితో సేవామందిరంలో తండ్రి సంపత్‌కుమార్‌తో కలసి ఉంటోంది. వర్క్‌ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ తండ్రికి ఆసరాగా ఉంటోంది. ఈ క్రమంలో ఒంటరితనంతో మానసిక వేదనకు లోనైన ఆమె బుధవారం రాత్రి యథావిధిగా తండ్రితో కలిసి భోంచేసిన అనంతరం తన గదిలోకి నిద్రించింది. గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో తండ్రి వెళ్లి కిటికీ తెరిచి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సంపత్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రంగడు యాదవ్ తెలిపారు.
స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
రాప్తాడు రూరల్: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు..అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్‌కు చెందిన గోవిందప్ప కుమారుడు కృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో నందమూరినగర్ నుంచి పిల్లిగుండ్లకాలనీకి బైకుపై వెళుతుండగా నరిగిమ్మ ఆలయం దాటిన తర్వాత ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన బొలెరో వాహనం ఢీ కొంది. ఘటనలో కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతిలోని స్విమ్స్‌కు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ యోగా పోటీలకు ‘అనంత’ ఆతిథ్యం