
పీహెచ్‌సీ నిర్మాణానికి భూమిపూజ
రొద్దం: మండలంలోని పెద్దమంతూరు రొప్పాల వద్ద రూ.2కోట్లతో చేపట్టిన పీహెచ్‌సీ నిర్మాణానికి గురువారం మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,.. పీహెచ్‌సీ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వాసులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పెద్దమంతూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ బాలిక మృతి
ధర్మవరం అర్బన్: విద్యుత్‌షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక బుధవారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీహరి, రేష్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బతుకు తెరువు కోసం మూడు నెలల క్రితం ధర్మవరానికి వలసవచ్చి శారదానగర్‌లో నివాసముంటున్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ ఏడాది జూలై 14న చంద్రబాబు నగర్‌లో మాయకుంట్ల జయచంద్రకు చెందిన ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్న సమయంలో పెద్ద కుమార్తె వెంకటేశ్వరి (10) కూడా తల్లిదండ్రులతోపాటు వెళ్లింది. ఆ సమయంలో పైభాగంలో 11 కేవీ విద్యుత్ లైన్ ప్రమాదవశాత్తు తగిలి షాక్‌కు గురైంది. వెంటనే బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం, తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ నెల 24న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం బాలిక మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సెక్యూరిటీ గార్డు దుర్మరణం
హిందూపురం: స్థానిక జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తూముకుంట పారిశ్రామక వాడ నుంచి హిందూపురానికి వెళుతున్న సెక్యూరిటీ గార్డు మహబూబ్ బాషా (40)ను మిట్టమీదపల్లి గేట్ వద్ద బెంగళూరు నుంచి వెళుతున్న ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పీహెచ్‌సీ నిర్మాణానికి భూమిపూజ