
ద్విచక్ర వాహనానికి నిప్పు
పెనుకొండ రూరల్: మండలంలోని మరువపల్లి కి చెందిన గొల్ల శ్రీనివాసులు ద్విచక్ర వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు. మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఉంచిన వాహనానికి అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టడంతో కాసేపటికి మంటలు ఎగిసి పడ్డాయి. అప్రమత్తమైన చుట్టుపక్కల వారు వెంటనే యజమానిని అప్రమత్తం చేసి, మంటలు ఆర్పారు. అప్పటికే ద్విచక్ర వాహనం కాలిపోయింది. వాహన యజమాని శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పంచాయతీ పురోగతి
సూచికపై నేడు శిక్షణ
అనంతపురం సిటీ: అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్‌లోని డీపీఆర్‌సీ భవన్‌లో ‘పంచాయతీరాజ్ పురోగతి సూచిక 1.0’ అనే అంశంపై ఒక రోజు శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించనున్నట్లు శిక్షణ కేంద్రం జిల్లా మేనేజర్ నిర్మల్ దాస్ గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఐసీడీఎస్ అధికారులు, డీడీఓలు, డీఎల్‌పీఓలు, ఇంకా పలు శాఖల అధికారులు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులు ప్రారంభిస్తారని వెల్లడించారు. సీఈఓ, డిప్యూటీ సీఈఓ కూడా పాల్గొంటారని వివరించారు.
కొనసాగుతున్న
విజిలెన్స్ తనిఖీలు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ ఎంఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. డీఎస్పీ ఎం.నాగభూషణం, సీఐలు కే శ్రీనివాసులు తదితరులు ఆరు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వల్లో తేడాలను గుర్తించి రూ.1.82 లక్షల విలువైన 6.85 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలను నిలిపి వేస్తూ నోటీసులు జారీ చేశారు.

ద్విచక్ర వాహనానికి నిప్పు