
ఉత్సవాల్లో అల్లర్లకు తావివ్వొద్దు
కదిరి టౌన్: వచ్చే నెల 2న కదిరిలో జరిగే వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లకు తావివ్వరాదని ఉత్సవ కమిటీల నిర్వాహకులు, మత పెద్దలకు ఎస్పీ రత్న సూచించారు. స్థానిక కోనేరు సమీపంలోని ఓ ప్రైవేట్ కల్యాణమంటపంలో గురువారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు నిమజ్జనానికి విగ్రహాలను ఊరేగించే మార్గంలో అక్బరియా మసీదు, ఈద్గా. అలంఖాన్ మసీదు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. సోదరభావంతో మెలగాలని సూచించారు. అనంతరం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలపై ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఊరేగింపు సమయంలో డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వి.వి.ఎస్.శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నారాయణరెడ్డి, నిరంజన్‌రెడ్డి, నాగేంద్ర, ట్రాన్స్‌కో ఏఈ, మున్సిపల్ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ రత్న