
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, మడకశిర యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు నాగభూషణ్‌రెడ్డి, రంగనాథ్, రవికుమార్, అశ్వత్థనారాయణ విమర్శించారు. గురువారం వారు మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. 5 రోజుల క్రితం మడకశిర మండలం ఎం.రంగాపురంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారయత్నం ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే స్పందించలేదన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదులోను, నిందితుడి అరెస్ట్‌లోనూ నిర్లక్ష్యం వహించారన్నారు. అధికార పార్టీ నాయకులు చెబితేనే పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటారని, లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమేనన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా పోలీసులు నిష్పాక్షపాతంగా వ్యవహరించకపోతే వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతారన్నారు. మడకశిర మండలంలో బాలికపై అత్యాచార ఘటననునియోజకవర్గ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమంతరాయప్ప ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి