
నిరసనల మధ్య గణనాథుడి నిమజ్జనం
లేపాక్షి: మండలంలోని కల్లూరు గ్రామంలో ప్రజల నిరసనల మధ్య వినాయక ప్రతిమల నిమజ్జన కార్యక్రమం సాగింది. వివరాలు.. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో గణనాథుడి ప్రతిమలను కొలువుదీర్చి వేడుకలు జరపాలని నిర్ణయించుకున్న స్థానికులు ఆ మేరకు అనుమతుల కోసం నాలుగు రోజలు క్రితమే పోలీసులను కలిసి మాట్లాడారు. మండలంలోని కల్లూరు, కోడిపల్లితో పాటు మరో రెండు గ్రామాలు అత్యంత సమస్యాత్మక జాబితాలో ఉండడంతో వినాయక మంటపాల ఏర్పాటు, నిమజ్జనం, డీజేలు, డ్రమ్స్‌లు ఉపయోగించరాదనే నిబంధనలను పోలీసులు వివరించారు. మంటపాలు ఏర్పాటు చేస్తే మరుసటి రోజే నిమజ్జనం చేయాలని సూచించారు. దీంతో బుధవారం రాత్రి వినాయక ప్రతిమలను కొలువుదీర్చి పూజలు చేశారు. గురువారం నిమజ్జనం చేయాలని, లేకుంటే బైండోవర్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేసారు. వినాయక మంటపాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏడాదికి ఒకసారి భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగపై ఆంక్షలు సరికాదని నినదించారు. కేవలం టీడీపీ నేతల దౌర్జన్యాలతోనే ఈ దుస్థితి దాపురించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిమలను నిమజ్జనానికి తరలించారు.