
ఎమ్మెల్యే అండతో హత్యాయత్నం
పుట్టపర్తి టౌన్: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అండ చూసుకుని టీడీపీ నాయకులు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, కేసు నమోదు చేసి న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాయం చేస్తున్నారంటూ ఎస్పీ రత్న వద్ద మడకశిర మండలం ఆర్.అనంతపురం గ్రామానికి చెందిన దళితులు వాపోయారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ రత్నకు వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. వివరాలు..
ఆర్.అనంతపురం గ్రామానికి చెందిన దళిత ఉగ్ర నరసింహులుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. 2018లో గ్రామంలో వినాయక చవితి పండుగ రోజున చిన్న పాటి అంశంలో ఉగ్ర నరసింహులుతో అదే గ్రామానికి చెందిన ఎస్సీ వర్గీయులు ఆంజనేయులు, మారుతి, రామాంజనేయులు గొడవపడ్డారు. మరుసటి రోజు మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు నరసింహులుతో పాటు ఆయన కుమారులపై దాడి చేశారు. దీనిపై అప్పట్లో బాధితుల ఫిర్యాదు మేరకు మడకశిర పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి 2019లోనూ మరోసారి గొడవపడడంతో పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అయితే పాత గొడవలు వద్దని 2024లో పెద్ద మనుషులు సమక్షంలో రాజీ పడి కేసులకు లోక్ అదాలత్‌లో పరిష్కారం పొందారు.
ఈ ఏడాది జూన్ 6న నరసింహులుపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. ఆయన కుమార్తెలు, కుమారులపై దాడులకు తెగబడ్డారు. ఈ విషయంగా మడకశిర పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ అంశంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జోక్యం చేసుకుని ఒత్తిడి చేయడంతో కేసును స్టేషన్‌కే పరిమితం చేస్తూ పోలీసులు నీరుగార్చారు. ‘పార్టీ మాది, కేసు లేదు.. ఏమి లేదు.. ఏం చేసుకొంటావో చేసుకో’ అంటూ స్థానిక టీడీపీ నాయకుడు కన్నా, మరికొందరు తరచూ బెదిరింపులకు దిగుతున్నారు. దౌర్జన్య పరులకు ఎమ్మెల్యే అండగా నిలవడంతో పోలీసులు సైతం నోరు మెదపడం లేదు. దీంతో తనకు, తన కుటుంబసభ్యులకు స్థానిక టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, వారి బారి నుంచి రక్షణ కల్పించి, హత్యాయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసి, న్యాయం చేయాలని ఎస్పీని కోరినట్లు బాధితులు తెలిపారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు
80 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.
ఒత్తిళ్లకు తలొగ్గి కేసును
నీరుగారుస్తున్న పోలీసులు
న్యాయం చేయాలంటూ
ఎస్పీకి దళితుల వినతి

ఎమ్మెల్యే అండతో హత్యాయత్నం