ప్రశాంతి నిలయం: ‘‘నా తోటలోని బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరితే.. చిలకం మధుసూదన్‌రెడ్డి అనుమతులు లేకపోతే మేం కనెక్షన్ మంజూరు చేయలేమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పు ఉన్నా.. అధికారులు బేఖాతరు చేస్తున్నారు. అధికారుల చర్యలతోనే నా చీనీతోట నీరులేక ఎండిపోతోంది. మీరైనా న్యాయం చేయండి’’ అంటూ ఓ రైతు కలెక్టర్ చేతన్‌ను వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే... ధర్మవరం మండలం ముచ్చురామికి చెందిన రైతు విశ్వనాథరెడ్డికి గ్రామంలో ఐదుఎకరాల పొలం ఉంది. ఏడాదిన్నర క్రితం బోరు వేసి కరెంట్ కనెక్షన్ కోసం ఽనిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం సర్వీసు మంజూరు చేసిన అధికారులు అవసరమైన పరికరాలు అందజేశారు. అయితే అప్పటి నుంచి ట్రాన్స్‌ఫార్మర్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో రైతు విశ్వనాథరెడ్డి పలుమార్లు మండల, డివిజన్, జిల్లా స్థాయి విద్యుత్ అధికారులను కలిసి తన పొలంలో చీనీచెట్లు ఎండి పోతున్నాయని, త్వరగా ట్రాన్స్‌ఫార్మర్ కనెక్షన్ ఇవ్వాలని వేడుకున్నారు. అయినా వారు స్పందించలేదు. చివరకు చిలకం మధుసూదన్‌రెడ్డిని కలవాలని, ఆయన చెబితేనే కనెక్షన్ ఇస్తామని సలహా ఇచ్చారు. చేసేది లేక విశ్వనాథరెడ్డి నాలుగుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సైతం అర్జీలు ఇచ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో హైకోర్ట్‌కు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నాడు. అయినా విద్యుత్ అధికారులు కోర్టు ఉత్తర్వులను లెక్కచేయలేదు. దీంతో సోమవారం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చిన రైతు విశ్వనాథరెడ్డి తన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎదుట బైఠాయించాడు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన దిగాడు. తన పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోతే ఆత్మహత్యే చేసుకుంటానన్నాడు. స్పందించిన కలెక్టర్ టీఎస్ చేతన్ అక్కడే ఉన్న విద్యుత్ శాఖ ఎస్‌ఈని ఆరా తీశారు. రైతుతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో త్వరలోనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్ కుమార్ హామీ ఇవ్వడంతో రైతు ఆందోళన విరమించాడు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగాటిపల్లి సురేష్‌రెడ్డి, రైతు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
కలెక్టర్‌కు ఓ రైతు ఫిర్యాదు