
మట్టి వినాయకుడిని పూజించాలి
ప్రశాంతి నిలయం: వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ మట్టితో చేసిన వినాయకుడినే పూజించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘పర్యావరణ అనుకూల వినాయక చతుర్థి’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందామని పిలుపునిచ్చారు. చెరువులు, జలవనరులకు నష్టం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసే విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడమే మేలన్నారు. నీటి వనరుల కాలుష్యాన్ని నివారించడానికి పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహాలను ఉపయోగించాలన్నారు. వినాయక మండపాలకు అనుమతులు జారీ చేసేటప్పుడు, విగ్రహాల ఏర్పాటు సమయంలో రెవెన్యూ, మున్సిపల్, జిల్లా పంచాయతీ, పోలీస్, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ చేతన్ పిలుపు