
ప్రాణాలు బలిగొన్న చేపల వేట
ధర్మవరం అర్బన్: చేపల వేట సరదా ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన సాకే రామాంజనేయులు (40)కు భార్య లక్ష్మీనరసమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం సాయంత్రం ధర్మవరం చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లిన రామాంజనేయులు ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో పడి మునిగిపోయాడు. సోమవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులు నీటిలో తెలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి రామాంజనేయులుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
చావు లేదంటూ ఊజీ గుళికలు మింగి...
చెన్నేకొత్తపల్లి: ప్రపంచం అంతమైనా తనకు చావు లేదని, కావాలంటే నిరూపిస్తానంటూ ఊజీ గుళికలు మింగి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... సీకేపల్లి మండలం ప్యాదిండి పంచాయతీ నామాల గ్రామానికి చెందిన ఆంజనేయులు (64)కు భార్య శివమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంత కాలంగా మతి స్థిమితం లేక గ్రామంలో తిరుగాడేవాడు. ఈ క్రమంలో సోమవారం అందరూ చూస్తుండగా తనకు చావు లేదని, ప్రపంచం అంతమైనా తాను మాత్రం జీవించే ఉంటానని, కావాలంటే నిరూపిస్తానంటూ గట్టిగా అరుస్తూ పొలం చల్లేందుకు తీసుకొచ్చిన ఊజీ గుళికలు తీసుకుని గబుక్కున నోట్లోకి వేసుకున్నాడు. గమనించిన కుమారుడు వెంకటేష్ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఊజీ మాత్రలు మింగిన వృద్ధుడిని స్థానికులు వెంటనే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆంజనేయులు మృతి చెందాడు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రాణాలు బలిగొన్న చేపల వేట