
పింఛన్ తొలగింపు బాబు కుట్రే
మడకశిరరూరల్: దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నూతన పింఛన్లు మంజూరు చేయలేక.. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించి పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. ఆదివారం హెచ్‌ఆర్ పాళ్యంలో ఆయన పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇంటి వద్దకే వలంటీర్ల ద్వారా పింఛన్ అందించారన్నారు. వ్యయప్రయాసలు.. పడిగాపులు దూరం చేసి ఠంచన్‌గా పింఛన్ అందించి లబ్ధిదారుల కళ్లల్లో సంతోషం నింపారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సహా వందలాది హామీలలో కొన్నింటిని అదీ అరకొరగా అమలు చేస్తూ ప్రజలను వంచిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనను గాలికి వదిలి రౌడీయిజం, అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అనర్హుల పేరిట తొలగింపు నోటీసులు జారీ అయిన దివ్యాంగులకు సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్ ఇవ్వకపోతే.. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు.
దగ్గుపాటిని సస్పెండ్ చేయాలి
జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై ఆనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను రమేశ్‌రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహించి ఆందోళనలు చేస్తున్నారన్నారు. వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు రమేశ్‌రెడ్డి