
‘పరిష్కార వేదిక’కు 200 అర్జీలు
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై మొత్తంగా 200 అర్జీలు అందాయి. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టరేట్‌లో అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడి వరకూ వచ్చి అర్జీలు ఇస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీలను పరిష్కరించే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్య పరిష్కరించాలన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి అందే అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరించారు. సోమవారం ఆయన.. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్, ఐ గాట్ కర్మయోగి, ఈ–కేవైసీ, పట్టాదార్ పాసు బుక్కులు, ఆధార్ సీడింగ్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారం కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ‘ఐ గాట్ కర్మయోగి’కి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని, ప్రతి ఉద్యోగికీ శిక్షణ ఇచ్చి పూర్తి చేసేలా ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆధార్ సీడింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని, ఈ–కేవైసీ పట్టాదార్ పాస్‌బుక్స్‌లో ఫొటో ఆప్‌లోడు చేయాలన్నారు. అన్నదాత సుఖీభవకు సంబంధించిన రైతుల భూమి వివరాలు పోర్టల్‌లో జాగ్రత్తగా ఆప్‌లోడ్ చేయాలన్నారు.
యూరియా పంపిణీలో మాయ
● రైతులు తీసుకోకపోయినా
తీసుకున్నట్లు నమోదు
● యూరియా అందక రైతుల పడిగాపులు
లేపాక్షి: యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే...తగు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. రైతులు యూరియా తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి యూరియా కోసం వచ్చిన రైతులను వెనక్కు పంపుతోంది. వివరాల్లోకి వెళితే... పలువురు రైతులు సోమవారం యూరియా కోసం కొండూరు సొసైటీ వద్దకు వెళ్లారు. ఆధార్ నంబర్‌ను కంప్యూటర్‌లో నమోదు చేయించగా... ఇదివరకే యూరియా పొందినట్టు చూపించడంతో ఎరువులు కోసం వచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. తాము ఎక్కడా యూరియా తీసుకోక పోయినా యూరియా తీసుకున్నట్లు ఎలా నమోదు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా మండల వ్యాప్తంగా 15 మంది నుంచి 20 మంది రైతులు వరకు ఎరువులు తీసుకోక పోయినా తీసుకున్నట్టు నమోదు చేయడం ఏమిటని ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ కార్యాలయం, ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో గాని యూరియా పొందలేదన్నారు. తమ పేరుతో ఎరువులను అమ్ముకున్నారా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. కాగా, మండలానికి 950 మెట్రిక్ టన్నుల యారియా అవసరమని వ్యవసాయాధికారిని శ్రీలత తెలిపారు. అయితే మండలానికి ఇప్పటి వరకు 12.600 మెట్రిక్ టన్నులు మాత్రమే స్టాకు వచ్చిందని సొసైటీ కార్యదర్శి కృష్ణారెడ్డి తెలిపారు. ఒక్కో పాసుపుస్తకానికి రెండు, మూడు బ్యాగ్‌ల యూరియా అవసరం ఉన్నప్పటికీ... ఎరువు కొరత కారణంగా ఇవ్వలేక పోయామని, ఉన్న స్టాకులో రైతులకు సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు.

‘పరిష్కార వేదిక’కు 200 అర్జీలు