
చేనేత కార్మికుడి బలవన్మరణం
లేపాక్షి: జీవితంపై విరక్తితో ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు.. లేపాక్షి మండలం బయన్నపల్లికి చెందిన లక్ష్మీపతి (35)కి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. లేపాక్షిలో చేతి మగ్గాలపై వస్త్రాలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో కొంత కాలంగా అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. జబ్బు నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం తెల్లవారుజామున రేకుల షెడ్డుకున్న ఇనుప కడ్డీకి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఆదెప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నేత్రదానంతో ఇద్దరికి చూపు
ధర్మవరం అర్బన్: మరణానంతరం నేత్రదానంతో ఇద్దరికి చూపును అందించవచ్చునని రోటరీక్లబ్ సభ్యులు శివయ్య, రమేష్, బీవీ చలం, శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన పోలా నారాయణప్ప(89) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రోటరీక్లబ్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుడి నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుటుంబ సభ్యులకు రోటరీక్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

చేనేత కార్మికుడి బలవన్మరణం