రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని లావాదేవీలపై కన్ను | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని లావాదేవీలపై కన్ను

Aug 6 2025 7:47 AM | Updated on Aug 6 2025 7:47 AM

 రిజి

రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని లావాదేవీలపై కన్ను

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుకుతున్న ప్రస్తుత రోజుల్లో అదే స్థాయిలో సైబర్‌ నేరాలూ పెచ్చుమీరాయి. పోలీసులు ఇందుకు అడ్డుకట్ట వేస్తున్నా.. వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజుకో కొత్తదారులను వెతుక్కుంటూ.. ఆధార్‌ వేలిముద్రలను కూడా విడిచిపెట్టడం లేదు. గోప్యంగా ఉన్న ఆధార్‌ సమాచారాన్ని అసలు ఎలా తస్కరిస్తున్నారని మిలయన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. జిల్లాలో ఈ తరహా నేరాలతో చాలా మంది నష్టపోతున్నారు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో సైబర్‌ నేరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌తో సైబర్‌ వల

గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకు ఖాతాల్లోని నగదు బదలాయింపులు

ధర్మవరం అర్బన్‌: వేలి ముద్రల ఆధారంగా బ్యాంక్‌ ఖాతాల నుంచి నగదు అపహరించే సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రజల బ్యాంక్‌ ఖాతాల్లోని నగదును అపహరిస్తున్నారు. ఈ దోపిడీకి ఎలాంటి ఓటీపీ మెసేజ్‌లు, అనుమతులు అవసరం లేకపోవడం గమనార్హం. కేవలం ఆధార్‌ నంబర్ల ఆధారంగా వాటికి లింక్‌ అయిన బ్యాంకు ఖాతాల్లోని నగదును మాయం చేస్తున్నారు. ఇందుకు ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌(ఏఈపీఎస్‌)ను ఉపయోగిస్తున్నారు.

ఓటీపీ రాదు...

ఖాతాదారుడి బ్యాంకు ఖాతా నుంచి నగదు లావాదేవీలు జరిపేటప్పుడు ఖాతాదారుడి మొబైల్‌కు ఓటీపీ రావడం సహజం. ఈ ఓటీపీ నంబర్‌ ఎంటర్‌ చేస్తేనే నగదు బదలాయింపు జరుగుతుంది. అయితే ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) ద్వారా ఎలాంటి ఓటీపీలూ రావు. దీంతో ఖాతాదారుడికి తెలియకుండానే నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో...

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న సైబర్‌ నేరగాళ్లు చాలా తెలివిగా ఖాతాదారుల వేలిముద్రలను సేకరిస్తారు. ఆధార్‌ ద్వారా బ్యాంకు ఖాతాలో డబ్బులు డ్రా చేయాలంటే రోజుకు రూ.10వేల నుంచి రూ.15వేలు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది సైబర్‌ మోసగాళ్లకు కలసి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు ముందు ఒకసారి, 12గంటలు దాటిన తర్వాత మరోసారి బ్యాంకు ఖాతాలో డబ్బు కాజేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో మూడు సార్లు మాత్రమే ఆధార్‌ వేలి ముద్రల ద్వారా డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటును సైబర్‌ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

లాక్‌ సిస్టమ్‌తో చెక్‌

ఆధార్‌ వేలిముద్రల ద్వారా ఖాతాదారుడి బ్యాంకు ఖాతాల్లో నగదు అపహరించే ఘటనలు ఇటీవల ఎక్కువయ్యా యి. ప్రజలు కూడా సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. గుగూల్‌ప్లే స్టోర్‌లో వెళ్లి ఎంఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆధార్‌ నంబర్‌ను లాక్‌ చేసుకుంటే సైబర్‌ నేరాలకు ఆస్కారం ఉండదు. ఖాతాలోని నగదు మాయం కాగానే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అలాగే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలి. ఒకవేళ బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బు పోయిన చాలా ఉదంతాల్లో ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోపు తిరిగి జమ అయింది.

– రెడ్డప్ప, టూ టౌన్‌ పీఎస్‌ సీఐ, ధర్మవరం

ఏఈపీఎస్‌ ద్వారా నగదు అపహరించేందుకు వేలిముద్రలు కీలకం కావడంతో సైబర్‌ నేరగాళ్లు రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్లలోకి అక్రమంగా చొరబడుతున్నారు. భూదస్త్రాల్లోని వేలిముద్రల పత్రాల్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వాటి ద్వారా నకిలీ వేలిముద్రలను సృష్టిస్తున్నారు. సాధారణంగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తోనే రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యే అవకాశముంది. కానీ కొన్ని శాఖల్లో గెస్ట్‌గా లాగిన్‌ అయ్యే అవకాశాన్ని సైబర్‌ నేరగాళ్లు ఆసరాగా చేసుకొని పత్రాల్ని కాజేస్తున్నారు. ఈ భూదస్త్రాల్లోని వేలిముద్రల ప్రింట్‌ను సేకరించేందుకు నేరస్థులు బటర్‌ పేపర్‌ను వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బటర్‌ పేపర్‌పైకి తీసుకున్న వేలిముద్రను గాజు గ్లాస్‌పై ముద్రించి రబ్బర్‌ పోయడం ద్వారా పాలీమర్‌ ప్రింట్‌ను తయారు చేస్తారు. ఇదే నకిలీ వేలిముద్రగా మారుతుంది. బయోమెట్రిక్‌ యంత్రంలో ఈ నకిలీ వేలిముద్ర పెట్టి సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు.

 రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని లావాదేవీలపై కన్ను 
1
1/2

రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని లావాదేవీలపై కన్ను

 రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని లావాదేవీలపై కన్ను 
2
2/2

రిజిస్ట్రేషన్‌ శాఖల్లోని లావాదేవీలపై కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement