
వీధివీధినా పశువులే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని ప్రతి వీధిలోనూ వీధి పశువుల బెడద తీవ్రమైంది. ఇప్పటికే కుక్కల గోలతో సతమతమవుతున్న ప్రజలు.. ఈ పశువుల బెడద ఎన్నడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నారు. ‘గో సంరక్షణ’ పథకాన్ని గాలికొదిలేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అనంతపురం కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో వీధి పశువుల బెడద నానాటికీ జఠిలమవుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, మడకశిర, హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, తదితర మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో పశువులు రోడ్డుపైనే ఉంటున్నాయి. వీటి పెంపకం దారులు మేత కోసం వాటిని రోడ్లపై వదిలేస్తున్నారు. ప్రధానంగా ఉభయ జిల్లా కేంద్రాల్లో ప్రధాన రోడ్లతో పాటు ప్రతి వార్డుల్లోనూ ఆవుల సంచారం పెరిగిపోయింది. రోడ్డుకు అడ్డంగా వస్తుండడంతో పలుమార్లు వాహనదారులు వాటిని ఢీకొని కిందపడి గాయపడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక ప్రధాన మార్గాల్లో రోడ్డుకు అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో కిందపడిన వాహనదారులు అకాలమృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి.
ప్లాస్టిక్, వ్యర్థాలతో ఆరోగ్యంపై ప్రభావం..
పట్టణ పరిసరాల్లో నివాసముంటున్న పశుపోషకులు వాటి సంరక్షణను గాలికి వదిలేశారు. ప్రభుత్వం సైతం గో సంరక్షణ పథకాన్ని అటకెక్కించడంతో పశుగ్రాసం అందక పలువురు రోడ్డుపైనే పశువులను వదిలేస్తున్నారు. దీంతో ఆకలితో అలమటిస్తున్న ఆవులు .. చెత్త దిబ్బల్లో, కంపోస్టు యార్డుల్లో ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాక వీటి పాలను ఆహారంగా తీసుకున్న ప్రజలు సైతం అనారోగ్యం బారిన పడుతున్నారు.
గోశాల ఉన్నా..
వీధి పశువుల సంరక్షణకు అనంతపురంలోని కలెక్టరేట్ ఎదురుగా గోశాలను ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ గోశాలకు ఆవులను తరలించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవచ్చు. అయితే ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో పశుపోషకులకు నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు కానీ, తదుపరి చర్యలు చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తామేమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్నట్లుగా అధికారులు వాపోతున్నారు.
అన్ని చోట్ల సంచారం
గుంతకల్లు టౌన్: పట్టణంలోని రహదారులు, ప్రధాన చౌరస్తాలతో పాటు కూరగాయల మార్కెట్‌లో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు ఆవులు, ఎద్దులు, లేగదూడలు అడ్డుగా రావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 18న సంతమార్కెట్‌లో రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ కూరగాయలు కొనుగోలు చేస్తున్న మహిళ మీదకు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ అంశాన్ని అదే నెల 26న జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు లేవనెత్తడంతో స్పందించిన అధికారులు వారం రోజుల్లోపు చర్యలు తీసుకుని రోడ్డుపైకి వచ్చిన ప్రతి పశువునూ గోశాలకు తరలిస్తామంటూ భరోసానిచ్చారు. అయితే నేటికీ ఇది కార్యాచరణలోకి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో వేల సంఖ్యలో
పశువులు రోడ్లపైనే..
నిద్రమత్తులో అధికారులు
పట్టించుకోని పాలకవర్గం
తరచూ ప్రమాదాలే
చిలమత్తూరు: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై వీధి ఆవుల సంచారంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనదారులు గాయపడుతుండగా.. మరికొన్ని సందర్భాల్లో మూగజీవాలు గాయాల పాలవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం చిలమత్తూరు మండలం కోడూరు థామస్ మన్రో తోపు వద్ద 44వ జాతీయ రహదారిని దాటుకుంటున్న ఆవును కారు ఢీకొంది. ఘటనలో ఆవు కొమ్ము విరిగిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది.

వీధివీధినా పశువులే..

వీధివీధినా పశువులే..