తిరంగా.. మదినిండా
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి భావం ఉప్పొంగింది. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదం మార్మోగింది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం చేసిన సైనికులకు మద్దతుగా శనివారం పుట్టపర్తిలో నిర్వహించిన తిరంగా యాత్ర ఆధ్యంతం దేశభక్తిని చాటింది. కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరంగా యాత్ర ర్యాలీ పట్టణంలో హనుమాన్ కూడలి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకూ సాగింది. ర్యాలీలో పాల్గొన్న యువత, విద్యార్థులు, పట్టణ ప్రజలు ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’, ‘మరళీనాయక్ అమర్ రహే’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏక తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. మనమంతా సురక్షితంగా ఉండేందుకు ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు అందరం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో మన సైనికుల పోరాటం మరువలేనిదన్నారు. దేశ భద్రత విషయంలో భారత్ రాజీ పడబోదన్న సందేశాన్ని మన సైనికులు ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. సైనికులకు మనమంతా నిలుద్దామని పిలుపునిచ్చారు.
పుట్టపర్తిలో ఘనంగా తిరంగా ర్యాలీ
సైనికులకు అండగా నిలుద్దామని కలెక్టర్, ఎస్పీ పిలుపు


